ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు పరిపాలనలో భాగస్వాములయ్యే అవకాశాన్ని 73వ, 74వ రాజ్యాంగ సవరణలు కల్పించాయి. ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు, పంచాయతీని ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు గ్రామసభ కీలకంగా నిలుస్తుంది. ప్రభుత్వాలు రూపొందించే చట్టాల ద్వారా సంక్రమించే అధికారాలన్నీ గ్రామసభకు ఉంటాయి. జాతీయ స్థాయిలో పార్లమెంటు, రాజ్యసభ సభ్యులు రాష్ట్ర స్థాయిలో శాసనసభ్యులు ప్రజల పక్షాన పరోక్షంగా విధాన నిర్ణయాలు తీసుకుంటారు. గ్రామపంచాయతీ, సంబంధిత అధికారుల సహకారంతో గ్రామసభల ద్వారా స్థానిక ఓటర్లే తమ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడి ఓటర్లంతా గ్రామసభ సభ్యులే. పంచాయతీ కార్యదర్శి గ్రామసభను నిర్వహిస్తారు. పగటి వేళ సభ్యులంతా కూర్చునేందుకు అనువైన చోట సభను నిర్వహించొచ్చు. సర్పంచి అధ్యక్షత వహించాలి. సర్పంచి లేనప్పుడు ఉపసర్పంచి అధ్యక్షత వహించాలి.
స్థానికంగా చేపట్టే ఎలాంటి పనులకైనా గ్రామసభ ఆమోదం తప్పనిసరి. పంచాయతీ స్థాయి అధికారులంతా విధిగా హాజరుకావాలి. రెండురోజులు ముందు షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు నోటీసుబోర్డు, దండోరా ద్వారా ప్రజలకు సమచారం తెలియజేయాలి. ఆ తేదీల్లో తప్పనిసరి.. అవసరాన్ని బట్టి గ్రామసభ నిర్వహించుకునే స్వేచ్ఛ పంచాయతీలకు ఉంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం.. ఏప్రిల్ 14, అక్టోబరు 3, జనవరి 2, జులై ఒకటో తేదీల్లో తప్పనిసరిగా సభ నిర్వహించాల్సి ఉంటుంది. 50 శాతం సభ్యులు కోరినప్పుడు కూడా గ్రామసభ నిర్వహించటం తప్పనిసరి. నిర్వహించకపోతే.. గ్రామ సభ నిర్వహించకుంటే పంచాయతీరాజ్ చట్టం 20-ఎ ప్రకారం సర్పంచి తన పదవిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.