ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సహకరించని ఉద్యోగులపై కఠిన వైఖరి - ఏపీ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా పీఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారమే కొత్త జీతాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇందుకు సహకరించని అధికారులు, ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైంది. ఆ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ శనివారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు.

govt reaction on employees
govt reaction on employees

By

Published : Jan 30, 2022, 8:56 AM IST

ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా పీఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారమే కొత్త జీతాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇందుకు సహకరించని అధికారులు, ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైంది. ఆ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ శనివారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం జనవరి 29 శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు జీతాల బిల్లులు సమర్పించని డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంట్‌ అధికారులు, వాటిని ప్రాసెస్‌ చేయని ఉప ఖజానా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

జిల్లా కలెక్టర్లు రంగప్రవేశం చేసి డీడీవోలు బిల్లులు సమర్పించాల్సిందే అని నిర్దేశించినా ఉద్యమ కార్యాచరణలో ఉన్న సిబ్బంది ఆ ఆదేశాలను శనివారం ఖాతరు చేయలేదు. కొందరు డీడీవోలు నేరుగా జిల్లా కలెక్టర్లకే స్పష్టంగా తమ నిరసన తెలియజేశారు. పీఆర్‌సీకి వ్యతిరేకంగా తాము బిల్లులు సమర్పించకూడదని నిర్ణయించుకున్నామన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 1.10 లక్షల బిల్లులు సమర్పించగా శనివారం ఆ సంఖ్య మరో 7 వేలు మాత్రమే పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అందరు ఖజానా అధికారులు ఆదివారం కూడా పని చేసి జీతాల బిల్లుల ప్రక్రియ పూర్తి చేయాలని ఖజానా శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

విభాగాధిపతి కార్యాలయం ఎక్కడ ఉన్నా ఇంటి అద్దె భత్యం 16శాతం వర్తింపు
కొత్త వేతన సవరణలో భాగంగా హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులు, విభాగాధిపతుల కార్యాలయాల్లో పని చేసే వారందరికీ 16శాతం ఇంటి అద్దె భత్యం వర్తించనుంది. ఇంటి అద్దె భత్యం 8శాతం వర్తించే ప్రాంతంలో విభాగాధిపతి కార్యాలయం ఉన్నా అక్కడి ఉద్యోగులకు కూడా 16శాతం ఇంటి అద్దె భత్యం వర్తింపజేయనున్నారు. విభాగాధిపతుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్‌ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇంటి అద్దె భత్యం విషయంలో ఉద్యోగుల్లో అసంతృప్తి రేగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి అమరావతి తరలివచ్చిన ఉద్యోగులు, అధికారులు అందరికీ గతంలో 30శాతం హెచ్‌ ఆర్‌ ఏ వర్తింపజేశారు. హైదరాబాద్‌లో ఎంత అద్దె భత్యం ఉందో అంతే మొత్తం ఇక్కడా ఇస్తూ వచ్చారు. తాజా వేతన సవరణలో భాగంగా వెలగపూడి సచివాలయంతో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో పని చేసే విభాగాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు 16శాతం హెచ్‌ ఆర్‌ ఏ వర్తింపజేశారు. విజయవాడ నగరం చుట్టుపక్కల 8శాతం హెచ్‌ ఆర్‌ ఏ ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన విభాగాధిపతుల కార్యాలయాల సిబ్బందికి అది వర్తించలేదు. తాజా ఉత్తర్వులతో వారికీ కూడా 16శాతం వర్తించేలా ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి:కొత్త పెన్షనర్లకు షాక్‌.. రూ.5-15వేల వరకు తగ్గుదల

ABOUT THE AUTHOR

...view details