దిల్లీలో కేంద్ర హోంమంత్రితో తెలంగాణ గవర్నర్ తమిళిసై సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై హోంమంత్రితో చర్చించినట్లు గవర్నర్ పేర్కొన్నారు. భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతానని వెల్లడించారు. రైలు, లేదా రోడ్డుమార్గంలోనే భద్రాచలం వెళ్తానని స్పష్టం చేశారు. మేడారం జాతరకు కూడా రోడ్డుమార్గంలోనే వెళ్లానని గుర్తు చేశారు. రోడ్డుమార్గంలో 5 గంటలపాటు ప్రయాణించి మేడారం వెళ్లానని తెలిపారు. తన విషయంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణ ప్రజలు, మీడియా అంతా గమనిస్తున్నారని చెప్పారు.
నేను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను. నేను అందరితో స్నేహపూరితంగా ఉండే వ్యక్తిని. రాజ్‌భవన్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. సీఎం, మంత్రులు, సీఎస్ రాజ్‌భవన్‌కు ఎప్పుడైనా రావొచ్చు. తమిళిసైని కాకపోయినా... రాజ్‌భవన్‌ను గౌరవించాలి. నేను ఎవరినీ విమర్శించట్లేదు. ఒక మహిళను గౌరవించే విధానం ఇది కాదు. -తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
యాదాద్రి ఆలయాన్ని తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నట్లు తెలిపిన గవర్నర్.. యాదాద్రి ఆలాయానికి వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ తనని కలవలేదని ఆవేదన చెందారు. ఉగాది వేడుకలకు తాను ప్రజాప్రతినిధులందర్నీ ఆహ్వానించానని తెలిపారు. అయితే ఎవరూ వేడుకలకు హాజరు కాలేదన్నారు. రాజ్‌భవన్‌కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. రాజ్‌భవన్, గవర్నర్‌ను కావాలనే అవమానిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తమిళిసైని కాకపోయినా... రాజ్‌భవన్‌ను గౌరవించాలని సూచించారు. తాను ఎవరినీ విమర్శించట్లేదని వెల్లడించారు. రాజ్‌భవన్, గవర్నర్ విషయంలో తెలంగాణలో ఏం జరుగుతుందో మాత్రమే చెప్తున్నానని వివరించారు. ఒక మహిళను గౌరవించే విధానం ఇది కాదని పేర్కొన్నారు.
అయితే అమిత్‌షాతో గవర్నర్ తెలంగాణలో ప్రోటోకాల్ వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్, ఇతర అంశాలను కేంద్ర హోంమంత్రికి వివరించారు. బుధవారం ప్రధానిని కలిసి కేసీఆర్ వ్యవహారశైలిపై గవర్నర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థికశాఖ మంత్రితోనూ గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు.
ఇవీ చూడండి: CM Jagan: వాలంటీర్ల సేవా భావానికి సెల్యూట్: సీఎం జగన్