TS Governor Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అత్యవసర దిల్లీ పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణలో గత కొన్నాళ్లుగా రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తమిళిసై హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది. గత కొన్ని నెలలుగా చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు కారణం. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉదంతం, రాజ్‌భవన్‌లో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు లాంటి అంశాలతో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య అంతరం పెరిగింది.
అక్కడే ఆజ్యం: గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్‌కు పంపింది. చాన్నాళ్ల కాలంపాటు ఆ సిఫారసును ఆమోదించని తమిళిసై... అభ్యర్థిత్వం పరిశీలనకు కొంత సమయం పడుతుందని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈలోగా కౌశిక్ రెడ్డి స్థానంలో మధుసూదనాచారి పేరును కేబినెట్ పంపగా... దానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అటు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు రాజ్‌భవన్ ముందు ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ కూడా నిర్వహిస్తానని తమిళిసై ప్రకటించారు.
ప్రోటోకాల్ పాటించని అధికారులు: కొవిడ్ కారణంగా రాజ్‌భవన్ వేదికగానే జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ రాలేదు. మంత్రివర్గం ఆమోదించని ప్రసంగాన్ని గవర్నర్ చదివారన్న ప్రచారం జరిగింది. సికింద్రాబాద్ కవాతు మైదానంలో సైనికవీరుల స్మారకం వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి విడివిడిగా వెళ్లి అంజలి ఘటించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనలో భాగంగా బేగంపేటలో ఇరువురు పాల్గొన్నప్పటికీ పెద్దగా మాట్లాడుకోలేదు. సమ్మక్క- సారలమ్మ దర్శనానికి వెళ్లిన గవర్నర్‌కు మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీ కనీసం స్వాగతం పలకలేదు.
గవర్నర్ ప్రసంగం లేకుండానే: ఈ పరిస్థితులు కొనసాగుతుండగా... శాసనమండలికి రెండోమారు ప్రొటెం ఛైర్మన్‌గా నియామకం కోసం ప్రభుత్వం దస్త్రం పంపింది. రెండోమారు కూడా ప్రొటెం ఛైర్మన్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన గవర్నర్... న్యాయసలహా తీసుకొని మరీ కొన్నాళ్ల తర్వాత ఆమోదించారు. బడ్జెట్ సమావేశాలు పరిస్థితులను మరింత దూరానికి తీసుకెళ్లాయి. ఉభయసభలు ప్రోరోగ్ కానందున గత సమావేశాలకు కొనసాగింపుగానే పరిగణిస్తూ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహించారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని గవర్నర్ తమిళిసై బహిరంగంగానే తప్పుపట్టారు. సాంకేతిక సాకులు చూపుతూ తన ప్రసంగం లేకుండా చూడడం సమంజసం కాదని... ఆపే అధికారం ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థికబిల్లుకు అనుమతించినట్లు వ్యాఖ్యానించారు. అధికార తెరాస కూడా పరోక్షంగా గవర్నర్ వైఖరిని తప్పుపట్టింది.
గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు: ఆ తర్వాత కూడా పలు వేదికలు, సందర్భాల్లో ప్రభుత్వ వైఖరిని గవర్నర్ తప్పుపట్టారు. ఉన్నత పదవుల్లో ఉన్న మహిళలకు కూడా తగిన గౌరవం లభించడం లేదని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘాటుగా వ్యాఖ్యానించారు. హన్మకొండ, యాదాద్రి పర్యటనలకు వెళ్లినపుడు కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది ముందస్తు వేడుకలకు ఆహ్వానించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులతో పాటు తెరాస నేతలు, ఉన్నతాధికారులు హాజరు కాలేదు. రాజ్‌భవన్‌కు ఎందుకు రాలేదో తనకు తెలియదన్న తమిళిసై... తనను ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మరీ ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు సిద్ధమని కూడా అన్నారు.
వేడెక్కించిన హస్తిన పర్యటన: ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో గవర్నర్ హస్తిన పర్యటన పరిస్థితులను మరింత వేడెక్కించింది. దిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడిన గవర్నర్.. అన్ని విషయాలను పూసగుచ్చినట్లు వివరించారు. తాను రాజకీయం చేశాననేందుకు ఏదైనా ఆధారంగా ఉందా అని ప్రశ్నించారు. రాజ్‌భవన్ చాలా పారదర్శకంగా ఉందని స్పష్టం చేశారు. అధికారుల వైఖరిపై తాను ఏ సమస్యను సృష్టించాలనుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని వివాదాస్పదం చేయలేదని... చర్చకు సిద్ధమని ప్రకటించారు. కారణాలు సాకుగా చూపి గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదని.. గవర్నర్‌గా ఎవరున్నా సరే పదవిని గౌరవించాలని తమిళిసై వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ