కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యావిధానం-2020ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభిప్రాయపడ్డారు. 21 వ శతాబ్దపు క్లిష్టమైన ఉన్నత విద్య అవసరాలు, రానున్న సమస్యలను... ఈ కొత్త విధానం పరిష్కరించగలదని ఆకాంక్షించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో జరుగుతున్న గవర్నర్ల సదస్సులో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ ఆన్‌లైన్ విధానంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొని నూతన విద్యా విధానంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలను సాధించాలనే లక్ష్యంతో, నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోందని గవర్నర్ అన్నారు. పరిశోధనల్లో నాణ్యత, పేటెంట్ ఆధారిత పరిశోధన, మేధో సంపత్తి హక్కులను ప్రోత్సహించే క్రమంలో.. జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థతో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. రాష్ట్రంలో సంస్థాగత పరిశోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి పరిశోధనా మండలిని ఏర్పాటు చేయటమే కాక, విద్యా సంస్ధలను పరిశ్రమలతో అనుసంధానించటం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.