తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతగ్రామం.. యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో దళిత బంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిన్న వాసాలమర్రి పర్యటనలో భాగంగా.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాసాలమర్రి గ్రామపంచాయతీలో ఉన్న 76 ఎస్సీ కుటుంబాలకు లబ్ధి చేకూరేలా తెలంగాణ దళిత బంధు పథకం కింద 7.6 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
మార్గదర్శకాలు వర్తిస్తాయి..
ఈ మేరకు ఆ మొత్తాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌కు విడుదల చేయాలని ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఎండీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దళిత బంధు పథకం అమలు మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఎండీ, యాదాద్రి జిల్లా కలెక్టర్ కు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
వాసాలమర్రిలో 76 ఎస్సీ కుటుంబాలు ఉండగా.. అన్ని కుటుంబాలకు దళితబంధు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితబంధు పథకం వాసాలమర్రితోనే ప్రారంభమవుతుందని చెప్పారు. హుజూరాబాద్‌లో అయ్యేది లాంఛనమే అని నిన్న జరిగిన సమావేశంలో సీఎం వెల్లడించారు.