AMARAVATI MUNICIPALITY : అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రకు రాజధాని రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా.. రాజధాని పరిధిలోని 22 పంచాయతీలతో అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని గ్రామ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజధాని పరిధిలోని 19 గ్రామ పంచాయతీలతో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రయత్నించింది.
ఇందుకోసం అప్పట్లో నిర్వహించిన గ్రామసభల్లో ప్రజలు ముక్తకంఠంతో ఆ ప్రతిపాదనను తిప్పికొట్టారు. 29 పంచాయతీలతో నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు ఏడు నెలల తరువాత మళ్లీ ఇప్పుడు రాజధాని పరిధి తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలతో కలిపి అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ జారీ చేసిన ఉత్తర్వులపై 21 పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణకు గుంటూరు కలెక్టర్ చర్యలు చేపట్టారు. పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, మండల పరిషత్ ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆయన ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులకు వెంటనే తాఖీదులిచ్చి తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో గ్రామసభల నిర్వహణకు సంబంధించి తుళ్లూరు మండలంలోని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులతో తుళ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు గురువారం తెలిపారు.