Police harassment: ‘అర్ధరాత్రి నన్ను ఇంట్లోంచి లాక్కొచ్చి పోలీసు వాహనం ఎక్కించారు. నాకు అటూ ఇటూ ఇద్దరు పోలీసులు కూర్చున్నారు. ఒకరు మోచేత్తో బలంగా నా ముఖంపై కొట్టారు. పెదవి పగిలి రక్తం కారుతుండటంతో.. ఆ బాధతో నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ముందుకు వంగాను. అప్పుడు మెడ మీద గట్టిగా కొట్టారు. 5 కిలోమీటర్ల దూరం వెళ్లేదాకా కొడుతూనే ఉన్నారు. పోలీసుల దెబ్బలకు తలంతా దిమ్ముగా అయిపోయి.. మాట్లాడలేకపోయాను’ అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడన్న అభియోగంపై సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు, ధరణికోటకు చెందిన గార్లపాటి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్ వాపోయారు.
తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో కలసి ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడకు పట్టీతో ఉన్న వెంకటేష్.. పోలీసుల కస్టడీలో, ఆసుపత్రిలో వైద్య చికిత్సల సమయంలో తనకు ఎదురైన అనుభవాల్ని వివరించారు. ‘పోలీసుల దెబ్బలకు పెదవి పగిలి రక్తం కారితే.. కార్లోనే నీళ్ల సీసా ఇచ్చి శుభ్రం చేసుకోవాలన్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు.
పోలీసులు నన్ను కొట్టారని, భుజం నొప్పిగా ఉందని మెజిస్ట్రేట్‌తో చెప్పాను. మెజిస్ట్రేట్ నా అవస్థ గమనించి అర్ధరాత్రి 12 గంటలకు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి పరీక్షల కోసం పంపారు’ అని తెలిపారు.
వైద్యులనూ మేనేజ్ చేశారు..ఆసుపత్రికి వెళ్లాక వైద్యులను పోలీసులు మేనేజ్ చేశారని వెంకటేష్ చెప్పారు. ‘నన్ను అసలు కొట్టనేలేదని, దెబ్బలేమీ తగల్లేదని డాక్టర్లకు చెప్పాలంటూ నాతో పోలీసులు అన్నారు. నాకు ఎక్కడ నొప్పిగా ఉందో డాక్టర్లకు చెబుతుంటే.. ‘నువ్వు యాక్షన్ చేస్తున్నావ్’ అంటూ పోలీసులు నన్ను గద్దించారు. డాక్టర్లు కూడా.. నటిస్తున్నావన్నారు.