Mini Theatre Gaali Budaga in Asifabad: తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ప్రజల సినిమా థియేటర్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఇక నుంచి ఇక్కడి సినీ అభిమానులు సినిమా చూడటానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ సినిమా చూసేందుకు.. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్ పట్టణాలకు వెళ్లేవారు. ఇప్పుడా అవసరం లేదు. మరో రెండు మూడు రోజుల్లో ఇక్కడ ప్రభుత్వ భాగస్వామ్యంతో స్థానికులకు వినోదం పంచే మినీ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తిగా కావొచ్చాయి. గత మూడు దశాబ్దాలుగా సినిమా థియేటర్ లేని జిల్లా కేంద్రంగా ఉన్న ఆసిఫాబాద్ వాసులకు వినోదం కరవైన నేపథ్యంలో కలెక్టర్ పర్యవేక్షణలో సినిమా థియేటర్ను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ అధీనంలోని జిల్లా సమైక్య, పిక్చర్ టైమ్ అనే ప్రైవేటు సంస్థ సాంకేతికత వాటాతో రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసి స్టార్టప్ మినీ తాత్కాలిక థియేటర్ను నిర్మించారు.
మూడు దశాబ్దాల తర్వాత..
గతంలో ఇక్కడ నిర్వహించిన "రామ్" సినిమా టాకీస్ మూడు దశాబ్దాల క్రితం మూతబడింది. అప్పటి నుంచి పట్టణ, సమీప ప్రాంతాల ప్రజలకు సినిమా చూడటం కష్టంగా మారింది. ఇప్పుడు జిల్లా కేంద్రం కావడంతో వేలాది మంది ఉద్యోగులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పట్టణ జనాభా పెరుగుతోంది. కానీ ఇందుకు అవసరమైన వినోదం, ఆహ్లాదం మాత్రం కొరవడింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ప్రజలకు వినోదం అందించడంతో పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జనకపూర్లో "గాలిబుడగ" మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. మంగళవారం.. మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఛైర్పర్సన్ కోవ లక్ష్మి.. తదితరులు పాల్గొని థియేటర్ను ప్రారంభించారు. మొదటగా అమ్మ సినిమా ట్రైలర్ వేశారు.