ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర ప్రభుత్వ పథకాలకు మంగళం?

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్రంలో ఇక స్వస్తి పలకాలని యోచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలతో వాటిని అనుసంధానించగలిగితేనే.. అవి రాష్ట్రంలో కొనసాగనున్నాయి. అయితే ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌.రావత్ మంగళవారం అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు జారీచేసిన అత్యవసర బడ్జెట్ సర్క్యులర్‌ను చూస్తే ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By

Published : Mar 2, 2022, 5:24 AM IST

central government schemes
central government schemes

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు ఆంధ్రప్రదేశ్‌లో ఇక స్వస్తి పలికే యోచన చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలతో వాటిని అనుసంధానించగలిగితేనే అవి రాష్ట్రంలో కొనసాగనున్నాయా? లేకుంటే నిలిచిపోతాయా? ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ మంగళవారం అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు జారీచేసిన అత్యవసర బడ్జెట్‌ సర్క్యులర్‌ను చూస్తే ఇవే అనుమానాలు వస్తున్నాయి. కేంద్రపథకాలకు రాష్ట్రం ఇక స్వస్తి పలికే యోచన చేస్తోందని ఆర్థికశాఖ వర్గాలూ పేర్కొంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేకం రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఈ పథకాల్లో కేంద్రం కొన్నింటిలో 90%, మరికొన్నింటిలో 75%, ఇతరత్రా 60% వరకూ తన వాటా నిధులిస్తోంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వాటా నిధులు భరించాలి. ఈ రూపేణా ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు వస్తుండగా.. రాష్ట్ర వాటాగా దాదాపు రూ.12 వేల కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోంది. చాలా ఏళ్లుగా కేంద్రం ఇచ్చే ఈ నిధులను ఇతరత్రా పథకాలకు రాష్ట్రం వినియోగించుకుంటోంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై గట్టి ఆదేశాలు జారీచేసింది. ప్రతి పథకానికీ సింగిల్‌ నోడల్‌ ఖాతా తెరవాలని నిర్దేశించింది. కేంద్రం నిధులిచ్చిన 21 రోజుల్లో రాష్ట్రవాటా నిధులూ జమ చేస్తేనే కేంద్రం తర్వాత విడత నిధులు ఇస్తుంది. దీంతో రాష్ట్రం తన వాటా సొమ్ము ఇచ్చేందుకు వీలుగా ఎస్‌బీఐ నుంచి ఓడీ సౌలభ్యాన్ని కోరితే వారు ససేమిరా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఇప్పటికీ రాష్ట్రం తన వాటా నిధులు సరిగ్గా జమ చేయకపోవడంతో కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రితో జరిగిన ఆర్థికశాఖ అధికారుల సమావేశంలో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్ర ప్రాధాన్య పథకాలతో వాటిని ఎలా జత చేయొచ్చో జాబితా సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ అన్ని శాఖలనూ అత్యవసర సమాచారం కోరారు. 2022-23 బడ్జెట్‌ ప్రతిపాదనల్లో కేంద్ర పథకాలను వేటిని వేటిని రాష్ట్ర ప్రాధమ్య పథకాలతో అనుసంధానించవచ్చో ఆ వివరాలు తెలియజేయాలని కోరారు. తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం ఈ గణాంకాలు పేర్కొంటూ మార్చి 3 నాటికి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. కేంద్రం అమలుచేసే దాదాపు 130 పథకాల్లో రాష్ట్ర ప్రాధమ్యాలు, రాష్ట్ర పథకాలతో అనుసంధానించగలిగేవి అయిదారుకు మించి ఉండబోవని ఆర్థికశాఖ అధికారుల అంచనా. వాటికే బడ్జెట్‌లో నిధులు చూపించి, కేంద్ర నిధుల నుంచి ప్రయోజనం పొందనున్నారు. మిగిలిన వాటికి రాష్ట్రవాటా నిధులు ఇచ్చేందుకు సుముఖంగా లేనందున వాటిని నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ముఖ్యమంత్రి అనుమతి తప్పనిసరి!

కేంద్ర ప్రాయోజిత పథకాలకు గతంలో ఆయా విభాగాధిపతులే కేంద్ర ప్రభుత్వానికో, ప్రాజెక్టు కమిటీలకో ప్రతిపాదనలు పంపేవారు. ఇకముందు ఎట్టి పరిస్థితుల్లో ఆయా శాఖాధిపతులు ఇలా ప్రతిపాదనలు పంపడానికి వీల్లేదని ఆదేశించారు. అలాంటి ప్రతిపాదనలను తొలుత ఆర్థికశాఖకు పంపాలి. వారి అనుమతితో ముఖ్యమంత్రి వద్దకు పంపి ఆయన అంగీకరిస్తేనే ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపే వీలుంటుంది. 2022-23 బడ్జెట్‌ అనుమతులు దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర పథకాలను అమలు చేయడానికి వీల్లేదనీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్దేశించారు.

ఇదీ చదవండి:Inter Exams in ap: ఇంటర్‌ పరీక్షలు వాయిదా..?

ABOUT THE AUTHOR

...view details