ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రక్తమోడిన రహదారులు.. నలుగురు మృతి, 14 మందికి గాయాలు

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగిన వేర్వరు రోడ్డు ప్రమాదాల్లో.. నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. అనంతపురంలో 3, కృష్ణాలో 2, కడపలో మరో ఘటన జరిగింది. ఆయా ప్రమాదాలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. రోడ్డుపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

By

Published : Feb 4, 2021, 10:14 PM IST

road accidents in various districts
రాష్ట్రంలో ఈరోజు రోడ్డు ప్రమాదాలు

అనంతపురం, కృష్ణా, కడప జిల్లాల్లో రహదారులు రక్తమోడాయి. ఆయా ప్రాంతాల్లో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో.. మొత్తం నలుగురు మరణించారు, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అనంతపురం జిల్లాలో...

రాయదుర్గం మండలం 74 ఉడేగోళం సమీపంలోని జాతీయ రహదారిపై.. ట్రాక్టర్ బోల్తా పడి 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితులంతా రేకులకుంటకు చెందిన వారని వెల్లడించారు. సర్పంచ్ అభ్యర్థి ఎర్రిస్వామి రెడ్డి నామినేషన్ కోసం రాయదుర్గం వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుకు దారి ఇవ్వబోయి కల్వర్టు పక్కన మట్టిలో వాహనం కూరుకుపోయిందని స్థానికులు చెప్పారు. 10 అడుగుల గుంతలో ప్రయాణికులు పడిపోగా.. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం ప్రధాన వైద్యశాలకు తరలించారు.

నార్పల మండలంలో..

నార్పల మండల కేంద్రం సమీపంలో ఆటో, ద్విచక్రవాహనం ఢీకొని.. బి.పప్పూరుకు చెందిన రమణయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు. నార్పలలో పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని పోలీసులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పుట్లూరు మండలంలో..

పుట్లూరు మండలం కడవకల్లు సమీపంలో అరటి గెలల లారీ బోల్తా పడింది. సరకుతో మార్కెట్​కి వెళ్తుండగా ఊహించని రీతిలో ప్రమాదం జరగడంతో.. అరటి గెలలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో దాదాపు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. అసలే ధర తక్కువగా ఉండటంతో.. కనీసం పెట్టుబడైనా వస్తుందనుకుంటే ఇలా జరగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

కృష్ణా జిల్లాలో...

కంచికచర్ల మండలం పరిటాల వద్ద లారీ ఢీకొని.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కొంకా గోపి అనే వ్యక్తి లారీ కింద పడి మరణించగా మరో క్షతగాత్రుడిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై కనుమూరు వద్ద రోడ్డు దాటుతున్న చలసాని చిన్నను.. పామర్రు నుంచి విజయవాడ వెళ్తున్న విద్యార్థులు ద్విచక్రవాహనంతో ఢీకొట్టారు. ఈ ఘటనలో అదే ఊరికి చెందిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ విద్యార్తికి గాయాలయ్యాయి.

కడప జిల్లాలో...

రాజంపేట మండలం చోప్పావారి పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి దళితవాడకు చెందిన శివాజీ, సుబ్రహ్మణ్యం, ప్రకాష్.. ద్విచక్రవాహనంపై రాజంపేటకి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శివాజీ మరణించాడు. మరో ఇద్దరిని తిరుపతికి తరలిస్తుండగా.. సుబ్రహ్మణ్యం మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ప్రమాదం వల్ల కొద్దిసేపు రాకపోకలు స్తంభించగా.. మన్నూరు ఎస్సై షేక్ రోషన్ అక్కడికి చేరుకొని ట్రాఫిక్​ను క్రమబద్దీకరించారు.

ఇదీ చదవండి:ఉరేసుకుని తల్లీ బిడ్డ ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details