Gay marriage in Hyderabad: బాజాభజంత్రీలు.. చుట్టూ బంధువులు.. హల్దీ, మెహందీ వేడుకలు.. వీటన్నింటి నడుమ వరుడు, వధువు ఒక్కటయ్యే వేడుకే వివాహం. అయితే.. ఆడ,మగ పెళ్లి చేసుకోవడంలో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. కానీ.. పెళ్లిపిల్ల స్థానంలోనూ పిలగాడే ఉంటే ఇది తప్పకుండా ప్రత్యేకమే! అలాంటి వివాహ వేడుకకు వేదికయ్యింది తెలంగాణ. దేశంలో ఇప్పటివరకు పలు చోట్ల లెస్బియన్, గే పెళ్లిళ్లు జరగ్గా.. తెలంగాణలో తొలిసారి ఈ ప్రత్యేక వివాహం జరిగింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో శనివారం డిసెంబర్ 8న గే జంట సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెద్దల సమక్షంలో వీళ్ల పెళ్లి ఎంతో గ్రాండ్‌గా జరిగింది.
అంగరంగ వైభవంగా..
First Gay Wedding in Telangana: ఈ పెళ్లికి ఇద్దరు వరుల కుటుంబసభ్యులు, సన్నిహితులు, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి సభ్యులు హాజరయ్యారు. ఫొటోషూట్లు, సన్నిహితుల ఈలలు, గోలలతో ఎంతో కోలాహలంగా వేడుక సాగింది. ఈ వివాహానికి హైదరాబాద్‌కు చెందిన కొందరు ట్రాన్స్‌జెండర్ మహిళలు హాజరై.. ఈ జంటను ఆశీర్వదిచారు. అధికారికంగా ధ్రువీకరణ దక్కకున్నా.. తామ పెళ్లిని ఓ వేడుకలా చేసుకోవాలనుకున్నామని.. అందుకే పంజాబ్, కోల్‌కతా నుంచి ప్రత్యేక దుస్తుల్ని డిజైన్ చేయించి మరీ వివాహం చేసుకున్నామని "ఈటీవీ భారత్"తో పంచుకున్నారు సుప్రియో. ఒకర్ని ఒకరు అర్థం చేసుకునే మనసుతో ఇలాగే జీవితాంతం కలిసుంటామని చెబుతున్నారు వీరిద్దరూ.