మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ... అమరావతి ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. సచివాలయంతో పాటు ప్రధాన రహదారులను దిగ్బంధించి ధర్నా చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత వరుసగా రెండ్రోజులు సెలవులు రావడంతో... పాలనపై ఎలాంటి ప్రభావమూ పడలేదు. నేటి నుంచి సచివాలయ కార్యక్రమాలు తిరిగి ప్రారంభం కానుండటంతో... మరింత తీవ్రంగా తమ నిరసనను తెలియజేయాలని రైతులు నిశ్చయించుకున్నారు.
అన్నదాతలకు వివిధ సంఘాలు, న్యాయవాదులు మద్దతు తెలపడంతో... ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయోననే ఉత్కంఠ నెలకొంది. సచివాలయానికి వెళ్లే మార్గంతో పాటు ప్రధాన కూడళ్లలో సుమారు 600 మంది పోలీసులు మోహరించారు. సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులకు నిరసన సెగ తగలకుండా... కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తుండగా... ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆందోళనలను ఆపే ప్రసక్తే లేదని రైతులు గట్టిగా చెబుతున్నారు.