తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల తీరుతెన్నులను ఈటీవీ భాత్ -ఈనాడు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ధాన్యం అమ్మేందుకు రైతులు పడుతున్న అవస్థలు, దోపిడీకి గురవుతున్న తీరు ఈ పరిశీలనలో స్పష్టంగా వెల్లడైంది. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం... ప్రతి బస్తా ధాన్యం రైతుభరోసా కేంద్రాల ద్వారా మిల్లర్లు కొనుగోలు చేసినట్లు కనిపిస్తుంది. వాస్తవంగా ఆర్కేబీల్లో రైతులకు అందే సేవలు నామమాత్రమే. ఆర్కేబీల పక్క ఇళ్లలో ఉండే రైతులు కూడా రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబెట్టి మిల్లుకు తీసుకెళ్లక తప్పడం లేదు. మిల్లుకు తీసుకెళ్లిన ధాన్యం బాగున్నప్పటికీ ధర తగ్గించి ఇస్తున్నారు. నెమ్ము, నూక శాతంలో తేడా ఉంటే మరింత కోత పెడుతున్నారు. సరాసరిన అయిదెకరాల్లో వరి సాగు చేసే రైతుకు 150 బస్తాల దిగుబడి వస్తే.. గరిష్ఠంగా రూ. 30 వేల వరకు నష్టపోతున్నారు.
రైతులు ధాన్యం కోసింది మొదలు.. అమ్మే వరకు మొత్తం ఆర్కేబీల ద్వారానే జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే తేమ, నూక సహా ధాన్యం నాణ్యతపై ఆర్కేబీ సిబ్బంది అభిప్రాయానికి, మిల్లర్ల వాదనకు పొంతన ఉండటం లేదు. ఈ తిప్పలన్నీ ఎందుకని భావిస్తున్న రైతుభరోసా కేంద్రాల సిబ్బంది.. తమ వద్దకు వచ్చే రైతులను మిల్లర్ల దగ్గరికి పంపుతున్నారు.