భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పైసా ఆదాయం రాక.. చేతిలో చిల్లిగవ్వ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సత్వరం బీమా సొమ్ము ఇస్తేనే రెండో పంటకు పెట్టుబడి లభిస్తుంది. లేదంటే ఇప్పటికే కుదేలైన రైతు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.
అక్టోబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పలు జిల్లాల్లో అరటి, బొప్పాయి, మిరప పంటలు కుళ్లిపోయాయి. ఎకరాకు రూ.78,805 నష్టం జరిగిందని ఉద్యానశాఖ అంచనా. మళ్లీ పండ్ల తోటలు వేసుకోవాలంటే ఎకరాకు కనీసం రూ.50వేలైనా అవసరం. పెట్టుబడి రాయితీ తాత్కాలిక ఉపశమనమే. పంటల బీమా సత్వరం ఇస్తేనే భరోసా లభిస్తుంది.
వరదల్లో 3.51 లక్షల ఎకరాల వరి దెబ్బతింది. రబీ పంట వేసుకోవాలంటే ఎకరాకు రూ.15-20 వేలైనా ఉండాలి. పెట్టుబడి రాయితీగా ఎకరాకు ఇచ్చిన రూ.6వేలు రబీకి చాలదు. ఎకరాకు రూ.32 వేలకు పైగా వచ్చే బీమా సొమ్ముతోనే.. మరో పంట వేసుకునే ధైర్యం వస్తుంది.
జులై, సెప్టెంబరులో సాధారణం కంటే 171% అధికంగా వానలు కురవడంతో రాయలసీమ జిల్లాల్లో వేరుసెనగ రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఎకరాకు ఒకటి రెండు క్వింటాళ్లే దిగుబడి రావడంతో పాటు నాణ్యత లేకపోవడంతో రూ.25 వేలకు పైగా నష్టపోయారు. మొత్తం సాగు విస్తీర్ణం 18.57 లక్షల ఎకరాలుంటే.. అందులో 14.27 లక్షల ఎకరాల పంట దెబ్బతింది. బీమా సత్వరం అందితేనే వీరికీ మరో పంట పెట్టుబడికి వెసులుబాటు లభిస్తుంది.
పత్తి రైతుల పరిస్థితీ ఇంతే. ఎకరానికి రూ.25వేల పెట్టుబడి పెట్టినా రెండు క్వింటాళ్ల దిగుబడీ రాని రైతులు ఉన్నారు. ముందే కౌలు చెల్లించిన రైతులు పెట్టుబడితో పాటు అదనంగా ఎకరాకు రూ.20 వేల వరకు నష్టపోయారు. పెట్టుబడి రాయితీతో పాటు తక్షణ బీమా అందితేనే వీరికి ప్రయోజనం.
భారీ వర్షాలు, వరదల కారణంగా జూన్ నుంచి అక్టోబరు వరకు సుమారు 20.61 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. రూ.3,084 కోట్ల మేర పంట నష్టం జరిగిందని ఇటీవల వచ్చిన కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదించింది. రైతులకు పెట్టుబడి రాయితీ రూపంలో రూ.1,192 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందులో ఇప్పటికే రూ.260 కోట్లు విడుదల చేసింది.