రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని.. ఇందుకు బాధ్యులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలను శిక్షించాలంటూ శుక్రవారం హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. యర్రబాలెం గ్రామానికి చెందిన రైతు దోనె సాంబశివరావు, ఐనవోలుకు చెందిన తాటి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని వేశారు. కోర్టు తీర్పు అమలు చేయకుండా అధికారులను ప్రభావితం చేస్తున్నందుకు ప్రభుత్వ పెద్దలను శిక్షించాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, జీఏడీ ప్రత్యేక సీఎస్ జవహర్‌రెడ్డి, అప్పటి న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత, శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, రహదారులు భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పురపాలకశాఖ పూర్వ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాజధాని అమరావతిని నిర్మించాలని, రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో కనీస అవసరాలైన రహదారులు, తాగునీరు, డ్రైనేజి, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలను ఆదేశిస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మార్చి 3న తీర్పిచ్చింది. భూసమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించాలని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తేల్చిచెప్పింది. ఆ తీర్పు ప్రకారం అధికారులు వ్యవహరించకపోవడంతో రైతులు కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు.
న్యాయస్థానం తీర్పును అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వంగా ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిలో అధికారులతోపాటు ముఖ్యమంత్రి, మంత్రుల పాత్ర ఉన్నందున వారినీ కోర్టుధిక్కరణ కింద శిక్షించాలన్నారు. కోర్టు ఆదేశాలు అమలు చేయడం మంత్రివర్గ బాధ్యత అన్నారు. అధికారుల వెనుక మంత్రులు ఉండి కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా చూస్తున్నారన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి, మంత్రులేనన్నారు. వారు న్యాయపాలనకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, ప్రతివాదులుగా పేర్కొన్న మంత్రులూ కోర్టుధిక్కరణ చట్టం సెక్షన్ 2(6) ప్రకారం శిక్షకు అర్హులన్నారు.
*రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారంలో అధికారులు విధులు నిర్వహించేలా నిరంతర పర్యవేక్షణ చేస్తామని హైకోర్టు తీర్పులో పేర్కొందని గుర్తుచేశారు. భూసమీకరణ పథకం నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట సమయం విధిస్తూ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించిందన్నారు. ఇప్పటి వరకు పనులను చేపట్టలేదన్నారు. ఇది కోర్టుధిక్కరణ కిందకు వస్తుందన్నారు. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో రాజధాని ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్య, పౌరులకు ఉచిత వైద్య సౌకర్యాలు, ఉపాధి హామీ పనులు దక్కడం లేదన్నారు.
*ఏపీసీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 61 ప్రకారం ‘టౌన్ ప్లానింగ్ స్కీమ్స్’ను అమలు చేయకుండా కోర్టుధిక్కరణకు పాల్పడ్డారన్నారు.
*భూములిచ్చిన రైతులకు రహదారులు, నీటి వసతులు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉల్లంఘించారన్నారు.
*ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానం తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ప్రతివాదులను కోర్టుధిక్కరణ కింద శిక్షించాలని కోరారు.
సీఎస్ అఫిడవిట్‌ను తిరస్కరించండి