extra fees for building constructions: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల వ్యవధిలో 12వేల చదరపు కిలోమీటర్ల కొత్త ప్రాంతాన్ని పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)ల పరిధిలో చేర్చింది. దీంతో వీటి పరిధి 71,329 చదరపు కిలోమీటర్లకు చేరింది. రాష్ట్రం మొత్తం భూభాగంలో 43.76% ప్రాంతం పట్టణాభివృద్ధి సంస్థల్లోనే ఉంది. దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన వాటిలో ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోని అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థ ఒకటి. ఈ జిల్లా మొత్తం విస్తీర్ణంలో 85% ప్రాంతం యూడీఏ పరిధిలోనే ఉంది. అయితే... గ్రామ పంచాయతీలను పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో చేర్చడంతో నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల కోసం ప్రజలు, స్థిరాస్తి వ్యాపారులపై అదనపు భారం పడుతోంది. రుసుములు ఏకంగా దాదాపు ఆరు రెట్లు పెరగడం గమనార్హం. యూడీఏలలో చేర్చిన ప్రాంతాల్లో వివిధ నిర్మాణాల కోసం జీవో 12 ప్రకారం ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటికి డెవలప్‌మెంట్ ఛార్జీలు అదనం.
- గ్రామ పంచాయతీల పరిధిలో 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం ఇప్పటివరకు రూ.910 చెల్లిస్తే సరిపోయేది. అదే పంచాయతీని పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ) పరిధిలో చేర్చాక రూ.5,920 చెల్లించాల్సి వస్తోంది.
- 100 చదరపు మీటర్లలో నివాసేతర భవన నిర్మాణం అనుమతుల కోసం గ్రామ పంచాయతీలకు రూ.1,510 చెల్లించేవారు. అదే పంచాయతీ... యూడీఏ పరిధిలో చేరాక రూ.8,920 చెల్లించాల్సి వస్తోంది.
- గ్రామ పంచాయతీల పరిధిలో 5 ఎకరాల్లో లేఅవుట్‌కు అనుమతుల కోసం రూ.40,400 చెల్లిస్తే సరిపోయేది. చదరపు మీటరుకు రూ.2 చొప్పున విధించేవారు. అదే పంచాయతీలు యూడీఏల పరిధిలోకి వెళ్లాక చ.మీ.కు రూ.4 చొప్పున మొత్తం రూ.80,800 వసూలు చేస్తుండటం గమనార్హం.
పూర్తికాని బృహత్ ప్రణాళికలు
గ్రామాలను యూడీఏల పరిధిలోకి చేర్చాక... రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, వీధి దీపాలు తదితర అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే... రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో ఏర్పడిన పట్టణాభివృద్ధి సంస్థల్లో సగం వాటికి బృహత్ ప్రణాళికలు (మాస్టర్ ప్లాన్లు) లేవు. గోదావరి, నెల్లూరు, అనంతపురం-హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థల బృహత్ ప్రణాళికలు రూపకల్పన దశలోనే ఉన్నాయి. సీఎం సొంత జిల్లా కడపలోని అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ముసాయిదా దశలోనే ఉంది.