రాజధానిని ఇడుపులపాయకు తరలించే కుట్ర: దేవినేని - అమరావతిపై దేవినేని ఉమ
అమరావతి విషయంలో వైకాపా నేతల తీరును, కామెంట్లపై.. మాజీ మంత్రి దేవినేని ఉమ అభ్యంతరం చెప్పారు. తాము ప్రపంచ స్థాయి రాజధానిని తేవాలనుకున్నామని.. అందుకు విరుద్ధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహించారు.
రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి.. కనీసం ట్విట్టర్ ద్వారా అయినా వెల్లడించాలని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజధాని అంశం రియల్ ఎస్టేట్ వ్యవహారం కాదన్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల నుంచి తమ ప్రాంతానికి రాజధాని తరలి రాబోతోందనే ప్రకటనలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 33 వేల మంది రైతుల త్యాగాన్ని... ఎవరి చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన జరిగిందనే అంశాన్ని... పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిని మారుస్తామని పేర్కొన్న తర్వాత రాజ్యసభ విజయసాయిరెడ్డి మాటలకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. ఇడుపులపాయకు రాజధానిని తీసుకెళ్లాలన్నది ముఖ్యమంత్రి కుట్రలో భాగంగా ఉందని ఆక్షేపించారు.