ఈఎస్ఐ వ్యవహారంలో అనిశా అధికారులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ అనిశా ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. టెలీ సంస్థలకు వైద్య సేవలు అప్పగించాలని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డెరెక్టర్‌ను 2016లో లేఖల ద్వారా ఆదేశించారనేది తనపై ఆరోపణ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
మూడేళ్ల జాప్యం జరిగింది
2017లో మంత్రిగా వైదొలిగితే.. ఈ నెల 10న కేసు నమోదుచేశారని... పోలీసులకు ఫిర్యాదు చేయడంలో మూడేళ్ల జాప్యం జరిగిందన్నారు. అవినీతి ఆరోపణ ఘటనల్లో మూడు మాసాల తర్వాత ఫిర్యాదు అందితే.. కేసు నమోదు చేసేందుకు ముందు ప్రాథమిక విచారణ జరపాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ప్రస్తుత కేసులో ఈ నెల 10న ఫిర్యాదు చేయగా.. ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండా అదే రోజు తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసు చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. తాను 2017 ఏప్రిల్ 2న కార్మికశాఖ మంత్రిగా బాధ్యతల నుంచి వైదొలిగానని... 2018 జూలై 28 నుంచి అవినీతి నిరోధక సవరణ చట్టం - 2018 అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు తనపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవన్నారు. ముఖ్యమంత్రి కక్ష పెంచుకుని తనను ఈ కేసులో ఇరికించారని.. తాను ఏ నేరానికి పాల్పడలేదన్నారు.
కక్షతోనే ఇరికించారు
తన సోదరుడు ఎర్రన్నాయుడు.. 2011లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జగన్ సంపద కూడగట్టారని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. దీనిపై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందని... ప్రాథమిక విచారణ తర్వాత ప్రస్తుత సీఎం జగన్, ఆయన సహచరులు, సంస్థలపై కేసు నమోదైందని గుర్తు చేశారు. తర్వాత సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసి 16 నెలలు జైళ్లో ఉంచిదన్నారు. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబంపై కక్ష పెంచుకుని ప్రతీకారం తీర్చుకునేందుకు సీఎం ఆదేశాల మేరకు తప్పుడు కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యుడిగా శాసనసభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించానని... ప్రజావ్యతిరేక విధానాలను నిలదీసినందుకే కేసులో ఇరికించారన్నారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై 18న ముగియనున్నాయని పేర్కొన్న అచ్చెన్నాయుడు... 19న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకోవడానికి కుట్ర పన్నారన్నారు. ఇది నేర దర్యాప్తు ప్రక్రియ దుర్వినియోగమే అవుతుందన్నారు.
శస్త్ర చికిత్స జరిగిందని చెప్పినా..