ఆదాయ పన్ను అధికారులమంటూ వచ్చిన దుండగులు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువులనే అపహరించిన ఘటన హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి కలకలం సృష్టించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన న్యాయవాది ప్రతాప్‌కుమార్ సోదరులు.... ప్రవీణ్, నవీన్, సునీల్ సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మనోవికాస్‌నగర్‌లో నివాసముంటున్నారు. మాజీ జాతీయ బ్యాడ్మింటన్ ఆటగాడైన ప్రవీణ్‌కుమార్... నిన్న రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఇంట్లో ఉండగా మూడు కార్లు వచ్చాయి. వాటిలోంచి ముగ్గురు వ్యక్తులు దిగి ఆదాయ పన్ను అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ప్రవీణ్, ఆయన సోదరులను బెదిరించి తమవెంట తీసుకెళ్లారు. వారితోపాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు కూడా పట్టుకుపోయారు. అడ్డొచ్చిన వాచ్‌మెన్‌పై దాడికి పాల్పడ్డారు.
భద్రత కట్టుదిట్టం..
ఘటన జరిగిన వెంటనే బాధితుల సోదరుడు ప్రతాప్‌రావు అందించిన సమాచారం మేరకు హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు రంగంలోకి దిగారు. నగర కమిషనర్ అంజనీకుమార్ బాధితుల ఇంటికి వెళ్లి వాకబు చేసిన అనంతరం ముగ్గురు సోదరులు కిడ్నాప్‌నకు గురైనట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. బోయిన్‌పల్లిలోని ప్రవీణ్ ఇంటి చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. వీరి కుటుంబం మొదటి అంతస్తులో నివసిస్తుండగా.... కింది అంతస్తులోని హోటల్‌లో పని చేస్తున్న సిబ్బందిని పోలీసులు విచారించారు. ప్రవీణ్‌రావు కుటుంబానికి సీఎం కేసీఆర్‌తో బంధుత్వం ఉంది. కిడ్నాప్ గురించి తెలియగానే మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మాలోతు కవిత అక్కడికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.