‘ఐఆర్, హెచ్‌ఆర్‌ఏ తగ్గించి, జీతం పెరిగిందంటే ఎలా? అయిదు డీఏ బకాయిలు ఇవ్వడంతోనే ఈనెల నుంచి జీతం పెరుగుతుంది. ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువగా ఎన్నడూ ఇవ్వలేదు. రెండు నెలలుగా సీఎస్ చెబుతున్నదే మళ్లీమళ్లీ చెబుతున్నారు. మసిపూసి మారేడుకాయలా చేస్తున్నారు. ఉద్యోగులకు లెక్కలు రావని అనుకుంటున్నారు’ అని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశం అనంతరం... వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు... ‘పీఆర్సీ నివేదికలో ఒకట్రెండు అంశాలు పరిగణనలోకి తీసుకొని, అంతా అమలు చేశామని ఎలా చెబుతారు? కేంద్ర పీఆర్సీ అమలు చేస్తామంటున్నారు. కేంద్ర ఉద్యోగుల్లో జాయింట్ సెక్రటరీ కేడర్‌లో ఉండే సీనియర్ ఐఏఎస్‌కు ఉన్న జీతం, ఇక్కడ జాయింట్ సెక్రటరీకి ఇస్తారా? ఉద్యోగులకు నష్టం జరిగేవి మాత్రమే కేంద్ర పీఆర్సీ నుంచి తీసుకున్నారు. అసలు కేంద్ర పీఆర్సీ అమలుపై ఓ కమిటీ ఏర్పాటు చేసి, ఉద్యోగ సంఘాలతో చర్చించి, అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. పీఆర్సీ అమలు జీవోలను ఉపసంహరించుకోవాలి. ఇక వీటిపై అధికారులతో చర్చలు జరిపేదిలేదు. వీరితో 10-12 సార్లు చర్చించినా ప్రయోజనం లేకపోయింది. అధికారుల కమిటీ అటు ఉద్యోగులను, ఇటు ప్రభుత్వాన్ని ముంచింది. ఇక అవసరమైతే సీఎంవో అధికారులతో మాత్రమే చర్చలు జరుపుతాం. సీఎం చొరవ చూపించాలి. అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాడేందుకు మాకు అభ్యంతరం లేదు’ అని తెలిపారు. ‘పీఆర్సీలో అనేక అంశాలు నష్టం చేసేవిగా ఉన్నాయి. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అశుతోష్‌మిశ్ర కమిటీ సిఫార్సులు ఉద్యోగులకు అందజేసి, వాటిపై చర్చించాలి. ఏదో నల్లబ్యాడ్జీలతో నిరసనతో ఏం చేస్తారని అనుకోవద్దు. రెండు, మూడు రోజుల్లో స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. ఉద్యోగుల ఆగ్రహం ప్రభుత్వానికి తెలియాలనే నిరసనలు ఆరంభించాం. సీఎం వద్ద సమావేశంతో ఫిట్‌మెంట్ వరకు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకొని అంగీకరించాం. హెచ్‌ఆర్‌ఏపై ఆరోజే సీఎం వద్ద చెప్పాం. ఇవేమీ పట్టించుకోకుండా అధికారుల కమిటీ సిఫార్సులు చేసింది. ఏకపక్షంగా ఇచ్చిన జీవోలపై పునరాలోచన చేయాలి’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులంతా బుధవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. గురువారం భోజన విరామ సమయంలో నిరసన తెలపనున్నారు.
హెచ్‌ఆర్‌ఏపై చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం బాధాకరం. కేంద్ర పీఆర్సీ కంటే నష్టం జరిగేలా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే జీవోలను వెనక్కి తీసుకోవాలి. ఉద్యోగుల ఆలోచనలకు అనుగుణంగా జీవో రూపొందించాలి. ఏకపక్షంగా ఇచ్చిన జీవోలను రద్దుచేసుకోవాలి. ఉద్యోగుల అభిప్రాయం తీసుకుని కొత్త జీవోలు ఇవ్వాలి. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యోగులంతా చర్చించుకుని ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.
- వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత
పీఆర్సీ విషయంలో తీరని అన్యాయం జరిగినందున ఉద్యోగ సంఘాలన్నీ కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఐక్యవేదిక ఏర్పాటుపై అన్ని సంఘాలతో చర్చిస్తామని చెప్పారు.