Many crops are not covered in e crop : సాగు చేసిన ప్రతి ఎకరాను "ఈ-క్రాప్" పరిధిలోకి తెచ్చి పంటల బీమా అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయిు. చాలా పంటలు ఈ-క్రాప్ పరిధిలోకి రావడం లేదు. సాధారణంగా జూన్ నుంచి సాగు మొదలవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ-క్రాప్ ప్రారంభించారు. సెప్టెంబరు 7 నాటికి పూర్తి చేయాలని ఆదేశించినా, 11 నాటికి 80 లక్షల వరకే నమోదు పూర్తయింది. పల్నాడు, శ్రీకాకుళం, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 70 శాతం లోపు పంటల నమోదు జరిగింది. ఈ ఏడాది వరి సాధారణ విస్తీర్ణం 39 లక్షల ఎకరాలు ఉంటే.. సెప్టెంబరు మొదటివారానికి 32 లక్షల ఎకరాల్లో నాట్లు పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ-పంటలో మాత్రం 27 లక్షల ఎకరాలే నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ-క్రాప్ నమోదుకు ఆర్.బీ.కేల్లోని వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు 22 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. అయితే చాలా మండలాల్లో సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి తోడు కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నమోదులో జాప్యం జరుగుతుందన్నది అధికారుల మాట.
రెవెన్యూ, వ్యవసాయశాఖల భాగస్వామ్యంతో 2016లో ఈ-క్రాప్ విధానం అమలు మొదలైంది. తొలుత నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ కేంద్రం సహకారంతో వెబ్‌లాండ్‌తో అనుసంధానిస్తూ ప్రక్రియ ప్రారంభించారు. ఆ తర్వాత యాప్‌ను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. గతేడాది పంటల బీమా చెల్లింపు, ధాన్యం అమ్మకాల్లో అవకతవకలు బయటపడటంతో.. ఇష్టారాజ్యంగా నమోదు ప్రక్రియ సాగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దిద్దుబాటు చర్యలు చేస్తూ మళ్లీ ఎన్.ఐ.సీకే బాధ్యతలు అప్పగించి రెవెన్యూ, వ్యవసాయ శాఖల అజమాయిషీ కిందకు తెచ్చింది.