గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంపై డ్రోన్ ప్రయోగం, ఆ తర్వాతి పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. పార్టీ నేతలతో హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు... ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత భద్రత కలిగిన తన నివాసంపై అనుమతిలేకుండా డ్రోన్‌లు ప్రయోగించడమేగాక... నిరనస తెలిపిన తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడాన్ని తప్పుబట్టారు. వరద నియంత్రణ, బాధితులను ఆదుకోవడంలో వైకాపా నేతలు విఫలమయ్యారని విమర్శించారు. నీళ్లు వెనక్కి తన్ని తన నివాసంలోకి ప్రవేశించేందుకే ప్రకాశం బ్యారేజీ గేట్లకు బోట్లు అడ్డుగాపెట్టారని ధ్వజమెత్తారు.
తనపై అక్కసుతో ప్రజలను ఇబ్బందులుపెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీశైలానికి భారీగా వరద వస్తున్నా... ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయ్యకపోవడమేంటని ప్రశ్నించారు. కృష్ణానదికి ఇంత పెద్ద ఎత్తున వరద వస్తుంటే... ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా సమీక్షించలేదని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీలో నీటిని నిలబెట్టి... ఒక్కసారిగా విడుదల చెయ్యడం కారణంగా దిగువ ప్రాంతాలు మునిగిపోయాయని తెదేపా నేతలు అధినేతకు వివరించారు. మంగళగిరి, దుగ్గిరాల, ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిపై వీడియోలు విడుదల చేశారు. చంద్రబాబు ఇంటిపై దృష్టిపెట్టడం మాని... ప్రజా సమస్యలపై తెదేపా నేతలు హితవు పలికారు.