CC Footage Command and Control Centers: సీసీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ పోలీసులు కొత్త సంవత్సరంలో మరో ముందడుగు వేయనున్నారు. ఫుటేజీల విశ్లేషణకు జిల్లాలవారీగా కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇప్పటికే చాలావరకు పోలీస్ స్టేషన్ల వారీగా కెమెరాల్ని అనుసంధానించారు. వాటిని డీఎస్పీ కార్యాలయాలు.. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ఒక యూనిట్‌లో చోటుచేసుకున్న ఘటనల దృశ్యాలను ఠాణాలోనే కాకుండా ఎస్పీ కార్యాలయంలోనూ ఉన్నతాధికారులు వీక్షించవచ్చు.
ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 6 లక్షల కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా కమిషనరేట్ల వారీగానే కాకుండా.. సైబరాబాద్‌లోని భారీ కమాండ్ కంట్రోల్ కేంద్రానికీ వీటిని అనుసంధానం చేశారు. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న జంట పోలీస్ టవర్లలో ఏర్పాటవుతున్న భారీ కమాండ్ కంట్రోల్ కేంద్రానికీ అనుసంధానం చేయనున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం, సిద్దిపేట కమిషనరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలకు సీసీ కెమెరాల అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా కమిషనరేట్ల పరిధిలో నగరాల్లో ఉన్నవి ఇప్పటికే అనుసంధానించగా.. గ్రామీణ ప్రాంతాల్లోనివీ అనుసంధానిస్తున్నారు.