ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీకి ఆదిలోనే అవాంతరాలు - ఏపీ తాజా వార్తలు

ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీకి ఆదిలోనే అవాంతరాలు ఎదరవుతున్నాయి. కార్డుదారుల సౌలభ్యం కోసం అంటూ మొదలుపెట్టిన కార్యక్రమం కొత్త చికాకులు తెచ్చిపెడుతోంది. పట్టణాల్లో పథకం ప్రారంభమై వారం గడుస్తున్నా పట్టుమని పది లక్షల మందికి కూడా నిత్యావసరాలు అందలేదు.

disruptions
disruptions

By

Published : Feb 11, 2021, 9:40 AM IST

భారీ వ్యయంతో ప్రారంభమైన.. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ బండి ముందుకు కదలనంటోంది. కార్డుదారుల సౌలభ్యం కోసం అంటూ మొదలుపెట్టిన కార్యక్రమం వారికి కొత్త చికాకులు తెచ్చిపెడుతోంది. పట్టణాల్లో పథకం ప్రారంభమై వారం గడుస్తున్నా పట్టుమని పది లక్షల మందికి కూడా నిత్యావసరాలు అందలేదు. గతంలో రేషన్‌ డీలర్ల ద్వారా అందించే నిత్యావసరాలను.. ఇప్పుడు వాహనాల ద్వారా ఇంటికే వెళ్లి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా మా వల్ల కాదంటూ వాహన ఆపరేటర్లు మొండికేయడంతో.. వాహన అద్దెతోపాటు హమాలీ ఖర్చులనూ పెంచింది. అయినా పంపిణీ చురుగ్గా సాగడం లేదు. అటు దుకాణాల్లో రేషన్‌ ఇవ్వక.. ఇటు బండి ఇంటికెప్పుడు వస్తుందో తెలియక కార్డుదారులు వాపోతున్నారు.

రోజుకు 10 గంటలు పైగా పనిచేస్తే..

సర్వర్‌ సక్రమంగా ఉండి, అక్కడకు ఇంటర్నెట్‌ అందుతుంటే.. వేలిముద్రలు తీసుకుని, ఒక్కో కార్డుకు రేషన్‌ తూకం వేసి ఇచ్చి, డబ్బు తీసుకోవడానికి కనీసం ఆరు నిమిషాలు పడుతోంది. ఇలా 81 కార్డులకు నిత్యావసరాలు ఇవ్వడానికి 8 గంటలకు పైనే అవసరం. వాహనం ఒక బజారు నుంచి మరో బజారుకు తీసుకెళ్లి నిలపడానికి అయిదు నిమిషాలు పడుతుందనుకున్నా ఆరు బజార్లు తిరగడానికి అరగంట కావాలి. అల్పాహారం, భోజనం, ఇతర పనులకు గంట పడుతుంది. దుకాణానికి ఉదయమే వచ్చి ఈ-పోస్‌ యంత్రం, బియ్యం, ఇతర నిత్యావసరాలు తీసుకెళ్లడానికి, సాయంత్రం వాటిని తీసుకొచ్చి అప్పగించడానికి మొత్తంగా ఓ గంట పట్టొచ్చు. అంటే రోజూ కనీసం 10.30 గంటలపాటు వాహనదారు, సహాయకుడు విధులు నిర్వహిస్తేనే 81 కార్డులకు రేషన్‌ పంచగలరు. పౌరసరఫరాలశాఖ లెక్కల ప్రకారం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా రేషన్‌ పంపిణీ చేయాలి. సర్వర్‌ సమస్య వచ్చినా, అంతర్జాలంలో అంతరాయాలు ఏర్పడినా, నెట్‌వర్క్‌ సరిగా పనిచేయకున్నా.. ఇక గంటల తరబడి ఇబ్బందులే. ఏదైనా సమస్యతో వాహనం నిలిచిపోతే మరో వాహనమూ ఉండదు. ప్రస్తుతం ఒక్కో డీలర్‌ పరిధిలో సగటున 500 కార్డులున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు దుకాణాలు తెరిచి నిత్యావసరాలు ఇస్తుంటారు. కుటుంబసభ్యులతోపాటు సహాయకులూ ఉంటారు. కొత్త విధానంలో ముగ్గురు, నలుగురు డీలర్ల పరిధిలోని కార్డులన్నింటికీ వాహనదారుడే వెళ్లి నిత్యావసరాలు అందించాలి. అంటే రెండు గ్రామాల్లో తిరగాలి. కొన్నిచోట్ల మూడు గ్రామాలూ వస్తున్నాయి.

కార్డుదారులకూ కష్టాలే..

పేద కుటుంబాలవారు డబ్బు వెసులుబాటు చూసుకుని, ఉదయం పనికి వెళ్లడానికి ముందో, వెళ్లివచ్చాకో రేషన్‌ దుకాణానికి వెళ్లి సరకులు తీసుకుంటారు. ఇప్పుడు రేషన్‌ బండి వచ్చే రోజున కచ్చితంగా ఇంటి వద్ద ఉండి సరకులు తీసుకోవాల్సిందే. ఆ రోజు కుదరకపోతే మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి.

ప్రస్తుత విధానంలో ఒక వాలంటీరు తన పరిధిలోని 50 కుటుంబాల వివరాలతో.. రేషన్‌ వాహనాల వారీగా మ్యాపింగ్‌ చేశారు. అంటే వారికి మాత్రమే సరకులిస్తారు. మరో వాహనానికి మ్యాపింగ్‌ చేసి ఉంటే ఇవ్వరు.

సర్వర్‌, ఇతర సమస్యల కారణంగా పంపిణీ నిలిచిపోతే... తర్వాత రోజు వెళ్లాలనుకున్న ప్రాంతానికి వెళ్లలేరు. రేపు రేషన్‌ పంపిణీ వాహనం వస్తుందని వాలంటీర్‌ ముందే చెప్పడంతో.. పనులు మానుకుని వారంతా ఇళ్ల వద్ద ఎదురు చూస్తుంటారు. అనుకున్నట్లు వాహనం రాకుంటే మరో రోజు ఇంటి వద్దే ఉండాల్సి వస్తుంది.

గిరిజనులు, వలస కార్మికులకూ వెతలే..

ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ 10, అక్కడ 10 చొప్పున గృహాలుంటాయి. ఇక్కడకు వాహనాలు వెళ్లడానికి రోడ్డుమార్గమూ సరిగా ఉండదు. అలాగని మొబైల్‌ ఆపరేటర్లు, వాలంటీర్లు మోసుకెళ్లి ఇవ్వలేరు. ఎప్పుడు వాహనం వస్తుందో తెలియని పరిస్థితి.. డీలర్‌ వద్దకు వెళ్లినా అక్కడ రేషన్‌ అందదు. ఇతర ప్రాంతాలకు వివిధ పనులపై వెళ్లే వలస కార్మికులు.. అక్కడే వేలిముద్ర వేసి రేషన్‌ తీసుకుంటున్నారు. వీరి సంఖ్య రాష్ట్రంలో దాదాపు 37.50 లక్షలు. వీరి వివరాలు మ్యాపింగ్‌ చేసి ఉండకపోవడంతో వలస వెళ్లినచోట రేషన్‌ బండి దగ్గర సరకులివ్వరు. చౌకదుకాణానికి వెళ్లినా అక్కడ ఈ-పోస్‌ యంత్రం ఉండకపోవటంతో రేషన్‌ అందడం లేదు. ఒకటి రెండు నెలల పనికోసం వలస వచ్చిన ప్రాంతంలో మ్యాపింగ్‌ చేయించుకుంటే.. తర్వాత సొంతూరికి వెళ్లినప్పుడు అక్కడ రేషన్‌ ఇవ్వరు. మళ్లీ మ్యాపింగ్‌ చేయించుకోవడం ఇబ్బందికరమైన ప్రక్రియ.

ఒకటే దేశం- ఒకటే రేషన్‌కూ ఆటంకాలే

దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో రేషన్‌ కార్డున్నా.. వారున్న చోటే నిత్యావసరాలు తీసుకునేలా ‘ఒకే దేశం- ఒకటే రేషన్‌ కార్డు’ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇంటింటికీ రేషన్‌ విధానంలో వీరికి నిత్యావసరాలు ఇవ్వరు. వారు డీలరు దగ్గరకు వెళ్లినా ఈపోస్‌ యంత్రాన్ని రేషన్‌ బండివారు తీసుకెళ్లడంతో అక్కడా సరకులు అందడం లేదు.

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయాలన్నారు.. పొద్దున్నే డీలర్‌ దగ్గరకెళ్లి మూటలు తీసుకొచ్చి ఇవ్వాలంటున్నారు. హమాలీలెవరూ రావడం లేదు. ఇంత చాకిరీ చేయాల్సి వస్తుందనుకోలేదు. - రేషన్‌ వాహన ఆపరేటర్లు

డీలర్‌ దగ్గర నుంచి ఉదయమే ఈ-పోస్‌ యంత్రం, బియ్యం తీసుకెళ్లి సాయంత్రానికి మిగిలిన సరకుతోపాటు వసూలైన సొమ్మును అప్పగించాలి. అన్నీ ముందే చెప్పాం. అంగీకరించి సంతకాలు పెట్టారు. - అధికారులు

రేషన్‌ బళ్లతో మీకు సంబంధం లేదు. వాటివైపు మీరెవరైనా వెళ్లినట్లు కన్పిస్తే చర్యలు తీసుకుంటామని మాతో చెప్పారు. ఇప్పుడేమో సహకరించమంటున్నారు. - డీలర్లు

వీలు కుదిరినప్పుడు చౌకదుకాణానికి వెళ్లి తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు పనిమానుకుని చూడాల్సి వస్తోంది. చెప్పిన రోజు బండి రాకపోయినా, వచ్చినప్పుడు మేం ఇంట్లో లేకపోయినా మళ్లీ ఎప్పుడిస్తారో తెలియదు. డీలర్‌ దగ్గరకెళ్లినా ఈ-పోస్‌ ఉండదు.- కార్డుదారులు

ఇదీ చదవండి:వాలంటీర్లకు రోజులో అరగంటే పని: బొత్స

ABOUT THE AUTHOR

...view details