SSC Exams at AP: పదో తరగతి పరీక్షల్లో.. భారీ సంస్కరణలు - massive versions in ap ssc exams
Tenth Grade Exams: ఒకపక్క పదో తరగతి పరీక్షల్లో భారీ సంస్కరణలు.. మరోపక్క కరోనాతో అభ్యసనం కోల్పోయిన విద్యార్థులు.. ఇలాంటి పరిస్థితుల మధ్య.. రెండేళ్ల తర్వాత పూర్తి సన్నద్ధతతో పది పరీక్షలు జరగనుండడంతో పిల్లలను సిద్ధం చేయడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కత్తిమీద సాములా మారింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కరోనా కారణంగా ఎనిమిదో తరగతిలో కొంత బోధన నష్టపోగా.. తొమ్మిదిలో ఆన్‌లైన్ తరగతులకే పరిమితమయ్యారు. ఈ విద్యా సంవత్సరం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది.
అనేక సంస్కరణలతో పదో తరగతి పరీక్షలు
By
Published : Apr 5, 2022, 5:01 AM IST
|
Updated : Apr 5, 2022, 9:34 AM IST
SSC Exams: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు సరిగా జరగకపోవడంతో చాలావరకు అభ్యసన నష్టపోయారు. ప్రైవేటులో ఆన్‌లైన్ తరగతులు జరిగినా విద్యార్థులు నేర్చుకున్నది తక్కువే. సెల్‌ఫోన్లకు అలవాటు పడడం, ఏకాగ్రత కోల్పోవడం, రెండు, మూడు గంటలపాటు ఒకేచోట కూర్చోలేకపోవడం, చేతిరాతలో వేగం కోల్పోవడం వంటివి విద్యార్థులకు సమస్యగా మారాయి. 2019-2020లో పదో తరగతి పరీక్షల సంస్కరణల్లో భాగంగా అంతర్గత మార్కుల విధానం, ప్రత్యేక బిట్‌పేపర్‌ను తొలగించారు.
కానీ ఆ సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. 2020-21లో 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లు, ఆ తర్వాత 7 పేపర్ల విధానం తీసుకొచ్చారు. ఈ ఒక్క (2021-22) ఏడాదికి ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో గ్రేడింగ్ విధానం ఉండగా..ఈసారి మార్కులను ప్రవేశ పెట్టారు. వేగం తగ్గిన చేతిరాత..కరోనా కారణంగా గత జులై వరకు విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.
నోటు పుస్తకాలు రాయడం తగ్గింది. దీంతో చేతిరాతలో వేగం మందగించింది. అసలు కొంతమంది విద్యార్థులు ఒకేచోట మూడు గంటలపాటు కూర్చోలేకపోతున్నారని జీవీబీఎస్‌ఎన్ రాజు అనే ఉపాధ్యాయుడు తెలిపారు. ఏకాగ్రతలోనూ మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. గణితంలో ఒక లెక్క చెప్పి, కొన్ని మార్పులతో మళ్లీ చేయమంటే చాలామంది తడబడుతున్నారని వెల్లడించారు. కొందరు పిల్లలు ఇళ్లకు వెళ్లిన తర్వాత ఎక్కువ ఫోన్లతోనే గడుపుతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారని.. ఆన్‌లైన్ తరగతులు, వాట్సప్‌లలో పాఠాల కారణంగా ఫోన్లకు అలవాటుపడిన వారు దాన్ని మానలేకపోతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఏడు పేపర్ల పరీక్షలో వంద మార్కులకు 3.15 గంటల చొప్పున సమయం ఇచ్చారు. అన్ని గంటలపాటు ఏకాగ్రతతో పరీక్ష రాసేలా పిల్లల్ని మానసికంగా సిద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టిసారించాలని సూచిస్తున్నారు.
ఒకేసారి చదివి రాయాలి.. సామాన్య శాస్త్రం మినహా మిగతా సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు. అకడమిక్ సంవత్సరం ఆలస్యంగా ప్రారంభించినందున 30 శాతం పాఠ్య ప్రణాళిక తగ్గించారు. గతంలో 50 మార్కుల చొప్పున 11 పేపర్లు ఉండడంతో చదువుకునేందుకు కొంత సమయం లభించేది. ఇప్పుడు సబ్జెక్టుకు సంబంధించి అన్ని పాఠాలను ఒకేసారి గుర్తుపెట్టుకుని రాయాల్సి ఉంటుంది. ఇది వెనుకబడిన విద్యార్థులకు కొంత ఇబ్బందికరమే.
తొమ్మిదో తరగతిలో పాఠాలు సరిగా జరగనందున చాలామంది భౌతికశాస్త్రంలోని లెక్కలను సరిగా చేయలేకపోతున్నారు. నిజానికి తొమ్మిదో తరగతిలోనే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి పదికి సన్నద్ధం చేస్తుంటారు. కానీ గతేడాది ఈ పరిస్థితి లేకుండాపోయింది.
3.15 గంటల పరీక్ష సమయం ఉన్నందున దీన్ని పూర్తి సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్ష రాసేందుకు కొందరికి ఎక్కువ సమయం పట్టింది. ఇలాంటి విద్యార్థులకు సమయ నిర్వహణపై ఉపాధ్యాయులు సలహాలు ఇస్తున్నారు.
విద్యార్థులు ఇంటి వద్ద ఫోన్ వాడకుండా, టీవీ చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
అదనపు పత్రాలు ఉండవు..
విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తారు. ఇందులో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అదనపు పేపర్లు ఇవ్వరు.
ప్రత్యేకంగా బిట్‌పేపర్ ఉండదు. ఒకటి, రెండు మార్కుల ప్రశ్నలు ఇస్తారు. వీటికి నేరుగా సమాధానం రాయాలి.
సూక్ష్మ లఘు, తేలికైన, లఘు, వ్యాసరూప ఇలా మొత్తం 33 ప్రశ్నలు ఇస్తారు.
'సామాన్యశాస్త్రం 50 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి.