ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆలయాల ఘటనలపై పార్టీల దుష్ప్రచారం: డీజీపీ - AP DGP gowtham sawang latest news

ఆలయాలపై దాడుల ఘటనలకు సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రతి ఘటన తర్వాత పార్టీల దుష్ప్రచారం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని అన్నారు. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే దురుద్దేశం అందులో ఉందని వెల్లడించారు.

dgp-gowtham-sawang
dgp-gowtham-sawang

By

Published : Jan 15, 2021, 5:46 PM IST

Updated : Jan 16, 2021, 6:42 AM IST

దేవాలయాలపై దాడుల ఘటనలు, గతంలో చోటుచేసుకున్న సంఘటనలను తాజాగా జరిగినట్లు దుష్ప్రచారం చేయడం వెనక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ఇప్పటివరకు తొమ్మిది కేసుల్లో 21 మంది ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందని, వారిలో 13 మంది తెదేపా, ఇద్దరు భాజపా కార్యకర్తలను అరెస్టు చేశామని తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎలాంటి సంఘటన జరగకపోయినా, ఏదో జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దురుద్దేశం కనిపిస్తోందన్నారు. దేవాదాయశాఖ, వివిధ సంస్థల భాగస్వామ్యంతో 13,296 ప్రదేశాల్లో 44,521 కెమెరాలను అమర్చామన్నారు. దాడులపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఏర్పాటుతోపాటు గ్రామస్థాయిలో 18,050 రక్షకదళాలు, మతసామరస్య కమిటీలు పనిచేస్తున్నాయని వివరించారు.
‘సామాజిక మాధ్యమాలు, సైబర్‌స్పేస్‌ ద్వారా తప్పుడు ప్రచారాలను ఎవరు సర్కులేట్‌ చేస్తున్నారో పరిశీలిస్తాం. అలాంటివి గ్రూపుల్లో వస్తే ఇతరులకు ఫార్వర్డ్‌ చేసినా నేరమే. కులం, మతం, ప్రాంతం పేరిట ఆరోపణలు చేసే వారిపై తీసుకోవాల్సిన చర్యలపై న్యాయ సలహా తీసుకుంటున్నాం’ అని సవాంగ్‌ వివరించారు.
అరెస్టైన వారిలో 13 మంది తెదేపా, ఇద్దరు భాజపా
దేవాలయాలపై దాడులకు సంబంధించిన మొత్తం తొమ్మిది కేసుల్లో... రెండింటిలో తెదేపా నేతల ప్రమేయం ఉందని డీజీపీ వెల్లడించారు. కడప జిల్లా కొండలవీడు ఘటనలో తెదేపా అగ్రనాయకత్వం పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరో ఏడు కేసుల్లో... గతంలో జరిగిన ఘటనలపై తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని తేలిందన్నారు. మొత్తంగా తెదేపాకు చెందిన 17 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి 13 మందిని, భాజపాకు చెందిన నలుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి, ఇద్దరిని అరెస్టు చేసినట్లు వివరించారు.
*కడప జిల్లా బద్వేలు మండలం కొండలవీడు ఆంజనేయస్వామి విగ్రహానికి అపచారం జరిగిన ఘటనలో తెదేపా సానుభూతిపరుడైన బొజ్జన సుబ్బారెడ్డి అరెస్టయ్యారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ఆయన పెదనాన్న ప్రభుత్వానికి భూమిని అమ్మారు. తన భూమిని కూడా సేకరిస్తారని భావించిన ఆయన.. అవాంతరాలు సృష్టించేందుకు యత్నించారు. ఈ కుట్రలో తెదేపా అగ్ర నాయకత్వ పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది.
*కర్నూలు జిల్లా మద్దికెరలో కొందరు వ్యక్తులు గుప్తనిధి కోసం పురాతన మద్దమ్మ గుడిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 8 మందిని అరెస్టు చేయగా... అందులో గొల్లా పెద్దయ్య, జి.రామాంజనేయులు, బి.జయరాముడు, ఎస్‌.ఫకృద్దీన్‌(తెదేపా)లు ఉన్నారు.
*రాజమహేంద్రవరం అర్బన్‌ పరిధిలోని బొమ్మూరులో వినాయక విగ్రహానికి అపచారం జరిగినట్లు అసత్య ప్రచారానికి పాల్పడ్డారని తెదేపాకు చెందిన వెల్లపల్లి ప్రసాద్‌బాబు, బాబూఖాన్‌ చౌదరిని అరెస్టు చేశారు. ఇందులో ఇదే పార్టీకి చెందిన చిటికెన సందీప్‌తోపాటు భాజపాకు చెందిన అడపా వరప్రసాద్‌, కార్టూరి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది.
*గుంటూరు జిల్లా నర్సరావుపేట శృంగేరి శంకరమఠంలో సరస్వతి దేవి విగ్రహానికి రెండేళ్ల కిందట నష్టం జరిగిందని తెలిసినా... సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి కారణమయ్యారని గ్రూప్‌ అడ్మిన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డిని(తెదేపా) అరెస్టు చేశారు.
*కర్నూలు జిల్లా మర్లమందకు 3కిలోమీటర్ల దూరంలోని ఆంజనేయస్వామి దేవాలయ టవర్‌పై విద్యుత్తు లైట్లను ఏర్పాటు చేసే సమయంలో ఎలక్ట్రీషియన్‌ పొరపాటుగా తగలడంతో సీతారాముల విగ్రహాలకు కొంత నష్టం జరిగింది. ఇందులో తప్పుడు ప్రచారానికి పాల్పడటంపై ఆలయ పూజారితోపాటు ఆలయ కమిటీ ఛైర్మన్‌ విశ్వనాథరెడ్డి(తెదేపా), మరో ఇద్దరు విలేకరులను అరెస్టు చేశారు.
*ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆర్చిపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మి, గరుత్మంతుడి విగ్రహాలు గతంలోనే దెబ్బతిన్నాయని తెలిసీ... తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని 13 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో విలేకరులతోపాటు తెదేపాకు చెందిన మద్దసాని మౌలాలి, గాలి హరిబాబు, కాకర్ల నరసింహారావును అరెస్టు చేశారు. అదే పార్టీకి చెందిన మించాల బ్రహ్మయ్య, వేల్పుల వెంకట్రావు, సిరిమల్లి సురేశ్‌పైనా కేసు నమోదైంది.
*విశాఖపట్నం రూరల్‌ పరిధిలోని గొలుగొండ మండలం ఎటిగిరాంపేటలో రామాలయంలోని వినాయకుడి విగ్రహం చెయ్యి విరిగిన ఘటన ఏడాది కిందటే జరగ్గా.. గదిలో పక్కన పెట్టారు. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేశారని కేసు నమోదు చేసి.. కిల్లాడ నరేశ్‌, పైలా సత్తిబాబు(తెదేపా)లను అరెస్టు చేశారు.
*శ్రీకాకుళం జిల్లా సోంపేట భూలోకమాత ఆలయంలో.. తిత్లీ తుపాను సమయంలో చెట్టు కొమ్మ విరిగిపడటంతో హనుమాన్‌ విగ్రహం దెబ్బతింది. అప్పుడు దెబ్బతిన్న విగ్రహం ఫొటోలు తీసి వాట్సాప్‌ గ్రూప్‌లలో అప్‌లోడ్‌ చేశారని దొంపేట మండల భాజపా కార్యదర్శి కొంచాడ రవికుమార్‌ను అరెస్టు చేశారు.
*శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఠాణా పరిధిలో సరస్వతీదేవి వీణ ఎప్పుడో దెబ్బతిన్నా.. ఇతర మతాల వారు ధ్వంసం చేశారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం సాగించారని భాజపాకు చెందిన ధర్మవరపు ఆచార్యను అరెస్టు చేశారు.

Last Updated : Jan 16, 2021, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details