రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు పాల్పడిన వైకాపా వారిని వదిలేసి... విధ్వంసాన్ని బయటపెట్టిన తెదేపా వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 17 మంది తెదేపా, నలుగురు భాజపా కార్యకర్తల ప్రమేయముందని... మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ తెదేపా నేతలతో శనివారం నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహిస్తూ, హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు చేయిస్తున్నారు. ఎన్నికల ముందు రిషికేష్‌వద్ద నదిలో మునకేసిన జగన్ డ్రామాను జనం ఇంకా మర్చిపోలేదు. మరో జగన్నాటకంలో భాగమే గోపూజ డ్రామా’ అని దుయ్యబట్టారు. ‘రామతీర్థం వెళ్లి రెచ్చగొట్టిన విజయసాయిరెడ్డిపై కేసు పెట్టకుండా... పర్యటనకు వెళ్లిన నాపై, అచ్చెన్నాయుడు, కళా వెంకటరావులపై తప్పుడు కేసులు పెట్టారు’ అని ఆగ్రహం వెలిబుచ్చారు.
సొంత బాబాయి వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేస్తే గుండెపోటుగా ప్రచారం చేసి నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ కేసుతోపాటు కోడికత్తి కేసునూ తెదేపాకు అంటించాలని కుట్రలు చేశారు. దేవాలయాలపై దాడుల్నీ తెదేపాకు ఆపాదించాలని చూస్తున్నారు.
- చంద్రబాబు
సజ్జల స్క్రిప్టు.. జగన్‌రెడ్డి డైరెక్షన్‌లో డీజీపీ యాక్షన్
సజ్జల స్క్రిప్టు, జగన్‌రెడ్డి డైరెక్షన్‌లో డీజీపీ యాక్షన్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘సీసీ కెమెరాలు పెట్టాలని ఆలయ కమిటీలకు నోటీసులిచ్చి, కెమెరాలు పెట్టేశామని చెప్పడం, మత సామరస్య కమిటీలు వేయాలని జీవోలిచ్చి, వేసేసినట్లుగా డీజీపీనే తప్పుడు సమాచారం ఇవ్వడం గర్హనీయం’ అని మండిపడ్డారు. ‘రాజకీయాలకు, దేవాలయాలపై దాడులకు సంబంధం లేదని భోగి రోజున చెప్పిన డీజీపీ గౌతం సవాంగ్... కనుమ రోజుకు మాటమార్చి ప్రతిపక్షాలకు అంటగడుతున్నారు. దేవాలయాలపై దాడులు చేసిన వైకాపా వారిని కేసుల నుంచి తప్పిస్తారా? దేవుడిపై భక్తితో దాడుల్ని బయటపెట్టిన వారిపై కేసులు పెడతారా? భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రులపై చర్యలెందుకు తీసుకోరు?’ అని నిలదీశారు. ‘రామతీర్థం దుర్ఘటనలో సూరిబాబుపై ఆరోపణలు చేశారు. చేయని తప్పు ఒప్పుకోవాలని భౌతికంగా హింసించారు’ అని ధ్వజమెత్తారు.
తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్
జగన్‌రెడ్డి సీఎం అయ్యాక తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ మళ్లీ ముమ్మరంగా సాగుతోందని, గంధపు చెక్కల వ్యాపారమూ ప్రారంభించారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ‘ఆధ్యాత్మిక చిత్తూరు జిల్లాను అరాచకాల మయం చేశారు. కొండపై శిలువ గుర్తులతో అన్యమత ప్రచారం, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ అసభ్య ప్రవర్తన, భక్తులకు అసభ్య వెబ్‌సైట్ల లింకులు పంపడం, దేవాదాయ భూములు అమ్మడం, ఒకే సామాజికవర్గానికి పదవులు ఇవ్వడం ద్వారా సామాజిక, దైవద్రోహానికి పాల్పడ్డారు’ అని ఆగ్రహం వెలిబుచ్చారు.
అన్ని వర్గాలు ఏకమై వైకాపాకు బుద్ధి చెప్పాలి
‘తిరుపతి ఉప ఎన్నిక... ముస్లిం వ్యతిరేక వైకాపా విధానాలకు గుణపాఠం చెప్పే ఓ మంచి అవకాశం. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఏకమై ఆ పార్టీ అభ్యర్ధిని ఓడించడం ద్వారా చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలి. తెదేపా ఎన్నికల ప్రచారాన్ని జనవరి 21 నుంచి 10 రోజులపాటు, 700 గ్రామాల్లో ఉద్ధృతం చేయాలి. తెదేపా అందించిన అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలి. వైకాపా విధ్వంసాలు, పన్నుల మోత, అప్పుల భారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తిరుపతి ఎంపీగా పోటీ చేయనున్న తెదేపా అభ్యర్ధి పనబాక లక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర యాదవ్, గౌరివాని శ్రీనివాసులు, రాజ నరసింహులు, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, పాశం సునీల్ కుమార్, నెలవల సుబ్రహ్మణ్యం, రామకృష్ణారెడ్డి, జేడీ రాజశేఖర్, బొజ్జల సుధీర్‌రెడ్డి, నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
ఆలయాల ఘటనలపై పార్టీల దుష్ప్రచారం: డీజీపీ