హైదరాబాద్‌లో డ్రగ్ సెంటర్ పెట్టాలని డిమాండ్.. కొవిడ్ మహమ్మారిపై యావత్ ప్రపంచం పోరాడుతున్న వేళ టీకాలు సంజీవనిగా మారాయి. వ్యాక్సిన్ వేసుకున్నవారికి వైరస్ ముప్పు చాలా వరకు తప్పుతోంది. పలు దేశాలు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయగా.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మనదేశంలోనూ మూడో దఫా టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వినియోగిస్తుండగా స్పుత్నిక్ వీ- కి కేంద్రం అనుమతిచ్చింది. ఆయా టీకాలకు అనుమతి లభించినా ప్రతీ బ్యాచ్ సెంట్రల్ డ్రగ్స్ లేబరీటరీ- సీడీఎల్ నుంచి ఆమోదం పొందాలి.
దేశంలో ఒకే ఒక్క ల్యాబ్...
నిర్ధేశిత పరీక్షలు చేసిన తర్వాతే వినియోగానికి సీడీఎల్ ఆమోదముద్ర వేస్తుంది. వ్యాక్సిన్‌ను బ్యాచ్‌ల వారీగా కనీసం 14 రోజల పాటు ల్యాబ్‌లో పరీక్షిస్తారు. ఇలాంటి ఆమోదం తెలిపే లేబరేటరీ.. దేశంలో ఒకేఒక్కటి ఉండటం సమస్యగా మారుతోంది. ప్రతీబ్యాచ్ శాంపిల్‌ను హిమాచల్ ప్రదేశ్ కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీ- సీడీఎల్‌కు పంపించాలి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కొవాగ్జిన్, కోవిషీల్డ్‌లకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో అన్ని రకాల వ్యాక్సిన్లకు చెందిన 2 వేల 132 బ్యాచ్‌లకు సీడీఎల్ ఆమోదం తెలిపింది. ఇందులో కరోనా టీకాలకు చెందిన బ్యాచ్‌లు 140కి పైగా ఉన్నాయి. స్పుత్నిక్- వీకి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
బ్రిటీష్ కాలం నాటిది...
హిమాచల్‌ప్రదేశ్ కసౌలిలో సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీని బ్రిటిష్ హయాంలో 70 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి దేశవ్యాప్తంగా అన్ని రకాల టీకాల పరీక్షల కోసం ఆ లేబరేటరీనే వినియోగిస్తున్నారు. క్రమేణా దేశంలో వివిధ నగరాల్లో టీకాల తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెన్స్‌కు రాజధానిగా, వ్యాక్సిన్ల హబ్‌గా అభివృద్ధి చెందింది. ఇక్కడి సంస్థలు అనేక రకాల టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. అన్ని అనుమతి పొందిన తర్వాత కూడా పరీక్షల కోసం 2 వేల కిలోమీటర్ల దూరంలోని కసౌలీకి పంపడం వల్ల విలువైన సమయం వృథా అవుతోంది. టీకాలను రెండు నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య ఉంచి రవాణా చేయాల్సి వస్తోంది. కసౌలీకి నేరుగా వాయు, రైలు మార్గం లేదు. అలాంటి పరిస్థితుల్లో కోల్డ్ చెయిన్ కొనసాగించడం కష్టంగా మారుతోంది. టీకాల పరీక్షల కోసం జంతువులు అవసరంకాగా.. లభ్యత లేకపోవడం వల్ల కొన్నిసార్లు పరిశ్రమ వర్గాలే విమానాల్లో పంపుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో హైదరాబాద్‌లోనే టీకాల పరీక్షల కోసం లేబరేటరీని ఏర్పాటు చేయాలని పరిశ్రమ వర్గాలు ఎప్పట్నుంచో కోరుతున్నాయి. సుదూర రవాణా ఇబ్బందులు తప్పడమే కాకుండా.. కరోనా వంటి విపత్కర సమయాల్లో కీలకమైన సమయం ఆదా అవుతుందని అంటున్నాయి.
రెండుసార్లు కేటీఆర్ లేఖలు...
డ్రగ్స్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ ఇప్పటికే రెండుసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సీడీఎల్ దూరంగా ఉండటం వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావించారు. ప్రస్తుతం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నేషనల్ యానిమల్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ కేంద్రం- ఎన్ఏఎఫ్బీఆర్ నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని ఉచితంగా అందించింది. ఎన్ఏఎఫ్బీఆర్... టీకాలు, వైద్య పరికరాలను పరీక్షించి ఆమోదం తెలిపే సౌకర్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీకాల పరీక్షలు, ఆమోదం కోసం కూడా ఈ కేంద్రానికి అనుమతి ఇవ్వాలని కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఎన్ఐఎన్లో పరీక్షలకు సౌలభ్యం
హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ - ఎన్ఐఎన్లో టీకాల పరీక్షలకు సౌలభ్యం ఉంది. యాంటీ రేబిస్, జపనీస్ ఎలిఫెంటా, హ్యూమన్ పాపిల్లోమా తదితర వ్యాక్సిన్లకు సంబంధించిన సేఫ్టీ అండ్ టాక్సికాలజికల్ ఎవాల్యువేషన్‌ను రెండు దశాబ్దాలుగా ఎన్ఐఎన్లో విజయవంతంగా చేస్తున్నారు. కరోనా వైరస్, టీకాల పరీక్షలకు అవసరమైన జంతువుల పెంపకం, సరఫరాలో ఎన్ఐఎన్కు చెందిన యానిమల్ ఫెసిలిటీ సెంటర్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇటీవలే ప్రయోగశాల, ఫెసిలిటీ సెంటర్ సామర్థ్యాన్ని కూడా పెంచారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్ టీకాల పరీక్షల కోసం సీడీఎల్ అనుమతుల కోసం ఎన్ఐఎన్ కూడా నోటిఫై చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: