CYBER FRAUD: క్రిప్టోలో పెట్టుబడి పెట్టండి.. అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.96 లక్షలు స్వాహా చేశారంటూ ఓ బాధితుడు సీసీఎస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ తెలిపారు. విజయనగర్‌కాలనీకి చెందిన వ్యాపారి వాట్సాప్ ఖాతాను ఓ వాట్సాప్ గ్రూపుతో అనుసంధానం చేశారు సైబర్ చీటర్లు. అందులోని సభ్యులు ‘ఈరోజు తనకు రూ.లక్ష లాభం వచ్చిందని ఒకరు..రూ.1.50లక్షలు వచ్చాయ’ని ఇంకొకరు.. ఇలా చర్చ జరుగుతోంది.
బాధితుడు అందులోని సభ్యులకు ఫోన్‌లు చేసి విచారించగా..‘బినాన్స్’(క్రిప్టో) యాప్‌తో పాటు మరో ప్రైవేటు యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. మొదట రూ.50 వేలు పెట్టారు. దానికి రూ.15 వేలు, తర్వాత రూ.18 వేలు, తర్వాత రూ.1500 డాలర్లు ఇచ్చారు. లాభంలో 30 శాతం కమీషన్ తమకు ఉంటుందని షరతు విధించారు. బాధితుడు ఏకంగా రూ.51వేల డాలర్లు(రూ.45 లక్షల వరకు) పెట్టేశారు. దానికి రూ.3 కోట్ల లాభం వచ్చిందని యాప్‌లో చూపిస్తోంది. కమీషన్ ఇస్తే ఆ డబ్బు వస్తుందని చెప్పడంతో బాధితుడు విడతల వారిగా మొత్తం రూ.96 లక్షలు చెల్లించాడు. డబ్బులు రాకపోగా ఇంకా కావాలని ఒత్తిడి చేయడంతో అనుమానం వచ్చి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.