కొవిడ్ కారణంగా మృతిచెందిన వారికి పరిహారం చెల్లించే విషయంలో.. రాష్ట్ర వైఖరిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్‌ఖన్నాలతో కూడిన సుప్రీం ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. కొవిడ్‌తో మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని పదేపదే ఉత్తర్వులు జారీచేసినా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసిందంటూ తప్పుబట్టింది. కొవిడ్‌తో 14 వేల471 మంది మృతి చెందినట్లు రికార్డుల్లో నమోదైతే, పరిహారం కోసం 31 వేలకుపైగా దరఖాస్తులొచ్చినట్లు న్యాయవాది చెప్పారన్న ధర్మాసనం..... ఇప్పటివరకు 11వేల మందికే పరిహారం చెల్లించినట్లు వివరించారని తెలిపింది. అర్హులకు పరిహారం చెల్లించకపోవడం అంటే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని..... ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. సీఎస్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు హాజరై, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాల ని జస్టిస్ ఎంఆర్ షా ఆదేశించారు. బిహార్ సీఎస్‌కూ ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ విషయంపై ప్రధాన కార్యదర్శి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. తొలుత ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది బసంత్ సమగ్ర వివరాలను మరోసారి కోర్టుకు వివరించారు. ఇప్పటివరకు 23 వేల 895 క్లెయిమ్‌లకు క్లియర్ చేశామనగా.. జస్టిస్ ఎంఆర్‌షా అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉదయం 11 వేల 494 క్లెయిమ్‌లే చెల్లించినట్లు చెప్పి, ఇప్పుడు 23వేల పైచిలుకు లెక్కలు చెబుతున్నారేంటి? అని ప్రశ్నించారు. న్యాయవాది బదులిస్తూ కొంత అయోమయంతో అలా చెప్పామని, ఇంకా చెల్లించాల్సిన క్లెయిమ్‌లు 10 వేల 894 మాత్రమే ఉన్నాయన్నారు. కోర్టు ఆరాటంతోనే ఇన్ని దరఖాస్తులు వచ్చాయని, అర్హమైన అన్నింటినీ క్లియర్ చేయడానికి 2 వారాల సమయం కావాలని కోరారు. దాంతో జస్టిస్ ఎంఆర్ షా అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆరాటం కోర్టుకు తప్పితే మీకు లేదని వ్యాఖ్యానించగా న్యాయవాది స్పందిస్తూ... సీఎస్ ఇక్కడే ఉన్నారని, మీ ఆరాటాన్ని వారికి చెప్పి త్వరగా చర్యలు తీసుకొనేలా చేస్తామన్నారు. అందుకు జస్టిస్ ఎంఆర్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి విషయంలో కోర్టు చెప్పేంతవరకు ఎందుకు వేచిచూస్తున్నారు? పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఇప్పటివరకు మీ ముందుకు వచ్చిన క్లెయిమ్‌ల్లో రికార్డులపరంగా నమోదైన 14 వేల 471 కేసులను కలిపారా? లేదా? అని అడిగారు. వాటినీ కలిపామంటూనే సీఎస్ సమీర్‌శర్మ కూడా ఇక్కడే ఉన్నారని న్యాయవాది పేర్కొనగా... ఆయన తెరమీదికి వచ్చి కోర్టుకు క్షమాపణలు తెలిపారు.