ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఒకేసారి వాటిని కూడా నిర్వహించండి' - ఏపీ పంచాయతీ ఎన్నికలు తాజా వార్తలు

వాయిదా పడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, పుర ఎన్నికలను నిర్వహించాలంటూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఎన్నికల కమిషనర్​ను కోరారు. తొలివిడత ఎన్నికలు ముగిసినందున.. మిగతా మూడు దశల ఎన్నికల నిర్వహణ పట్ల సీఎస్, ఎస్​ఈసీ, డీజీపీ చర్చించారు. సీఎస్ ప్రతిపాదన పట్ల నిర్ణయం తీసుకున్నాక వివరాలు వెల్లడిస్తానని నిమ్మగడ్డ చెప్పారు.

cs, dgp and sec meeting on local body elections
పంచాయతీ ఎన్నికలపై ఎసీఈసీ, డీజీపీ, సీఎస్ భేటి

By

Published : Feb 12, 2021, 7:09 AM IST

వాయిదా వేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు పెట్టింది. వరుసగా ఒకేసారి ఈ ఎన్నికలన్నీ పూర్తి చేయడంతో సమయం ఆదా అవుతుందని, ఎన్నికల కోడ్‌ బెడద తగ్గుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ముందు ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తరువాత వెల్లడిస్తానని ఎస్‌ఈసీ అన్నట్లు ఎన్నికల సంఘానికి చెందిన అధికారవర్గాలు తెలిపాయి.

గురువారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ని కలిసి తొలి దశ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడంపైనా, మిగతా మూడు దశల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. సాయంత్రం మళ్లీ సీఎస్‌ ఒక్కరే ఎస్‌ఈసీతో భేటీ అయినపుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా సీఎస్‌ వ్యక్తం చేశారని సమాచారం. నాలుగు దశల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలు ఈనెల 21తో పూర్తి కానున్నాయి.

ఆ వెంటనే గతంలో వాయిదా పడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికలు నిర్వహించే యోచనతో ఎన్నికల కమిషనర్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంటింటికీ బియ్యం పంపిణీ వాహనాలను ఎస్‌ఈసీ ఇటీవల పరిశీలించిన సందర్భంలో, వాహనాలపై ఇప్పుడున్న రంగులు మార్చాలని ఇచ్చిన ఆదేశాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉంటాయన్న సంకేతాలు ప్రభుత్వానికి ఇచ్చారు. సీఎస్‌, డీజీపీ గురువారం ఎస్‌ఈసీని కలిసిన సందర్భంలో వాయిదా పడిన ఎన్నికలు కూడా పూర్తి చేయాలన్న యోచనతో ఉన్న విషయాన్ని ఎస్‌ఈసీ వెల్లడించి ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరినట్లు సమాచారం. ఇదే విషయమై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాక సీఎస్‌ సాయంత్రం మళ్లీ ఎస్‌ఈసీని కలిసి ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహిస్తే పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నట్లు తెలిసింది.

నిర్ణయం ఎలా ఉంటుందో?

జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికలకు కొత్తగా మళ్లీ షెడ్యూల్‌ ప్రకటించి నోటిఫికేషన్‌ ఇస్తారా? ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెడతారా అనే దానిపై ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కొద్ది రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారనగా, పుర, నగరపాలక సంస్థల్లో కార్పొరేటర్‌ స్థానాలకు వేసిన నామినేషన్లు పరిశీలన దశలో ఉండగా కరోనా కారణంగా గత మార్చిలో ఎన్నికలు వాయిదా వేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కూడా జరిగా యి. ఈ పరిస్థితుల్లో ఎస్‌ఈసీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఏ విధంగా చూసినా వచ్చే నెలాఖరులోగా వాయిదా వేసిన ఎన్నికలు తిరిగి పూర్తి చేసేలా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ఎస్‌ఈసీతో కలిసి కాల్‌ సెంటర్‌ని పరిశీలించిన సీఎస్‌

ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. తనను కలవడానికి వచ్చిన సీఎస్‌ను తీసుకెళ్లి కాల్‌ సెంటర్‌ను ఎస్‌ఈసీ చూపించారు. కాల్‌ సెంటర్‌ పనితీరు, ఫిర్యాదుల పరిష్కారానికి అమలు చేసే విధానం, కాల్‌ సెంటర్‌పై పర్యవేక్షణ తదితర వివరాలను సీఎస్‌కు ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు వివరించారు.

మిగతా దశల ఎన్నికలూ ప్రశాంతంగా నిర్వహించాలి

రాష్టంలో మిగిలిన మూడు దశల ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మెరుగైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) రమేశ్‌కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు సూచించారు. తొలి దశ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా గురువారం సీఎస్‌, డీజీపీలు విజయవాడలోని ఎన్నికల సంఘ ప్రధాన కార్యాలయంలో ఎస్‌ఈసీని కలిశారు. మొదటి దశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడంపై సీఎస్‌, డీజీపీలను కమిషనర్‌ ఈ సందర్భంగా అభినందించారు. మిగతా దశల్లో ఎన్నికల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలపైనా వారితో ఎస్‌ఈసీ చర్చించారు. ఈ సమావేశంలో పలు సందర్భాల్లో ఎస్‌ఈసీ, సీఎస్‌, డీజీపీల మధ్య నవ్వులు వెల్లివిరిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:

ఎన్నికల్లో కలగజేసుకోవాలని రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు లేఖ

ABOUT THE AUTHOR

...view details