ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి రైతులకు సీఆర్‌డీఏ లేఖలు... ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచన

CRDA letters to farmers in Amaravati capital
CRDA letters to farmers in Amaravati capital

By

Published : Mar 19, 2022, 9:49 PM IST

Updated : Mar 20, 2022, 6:06 AM IST

21:45 March 19

రైతుల ఇంటికి వెళ్లి లేఖలు అందిస్తున్న సీఆర్‌డీఏ సిబ్బంది

రాజధాని పరిధిలో రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి, మూడు నెలల్లో అప్పజెప్పాలన్న హైకోర్టు ధర్మాసనం తీర్పుతో... సీఆర్‌డీఏ అధికారులు చర్యలు చేపట్టారు. రాజధానికి భూములిచ్చిన రైతులు... తాము పొందిన ప్లాట్లను ఈ నెల 31లోపు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటూ లేఖలు జారీ చేస్తున్నారు. ఈమేరకు సీఆర్‌డీఏ సిబ్బంది ఇంటింటికీ తిరిగి... రైతులకు లేఖలు అందజేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారు APCRDA వెబ్‌ సైట్‌లో మూడు రోజులు ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. భూమికి సంబందించిన అసలు ధృవపత్రాలు అందజేసి, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ పక్రియ పూర్తి చేసుకోవాలని... కాంపిటెంట్‌ అథారిటీ అండ్‌ స్పెషల్‌ డిఫ్యూటీ కలెక్టర్‌ పేరుతో లేఖలు జారీ చేశారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై సందేహాలు ఉంటే తుళూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో... ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 08645-244774, 08645-244778 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని లేఖలో సూచించారు.

గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో దాదాపు 65 శాతం రిజిస్ట్రేషన్లు చేసి, సరిహద్దురాళ్లు కూడా వేశారు. అయితే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణంతోపాటు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కూడా ఆపేశారు. దీనివల్ల రైతులకు కేటాయించిన ప్లాట్లలో ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు మొలిచాయి. ఎవరి ప్లాట్ ఎక్కడుందో తెలియడం లేదు. ప్లాట్లకు వెళ్లే రోడ్లు కూడా చిట్టడవిని తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆఘమేఘాలపై రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సీఆర్‌డీఏ అధికారులు శ్రీకారం చుట్టడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. ప్లాట్లు అభివృద్ధి చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మందడంలో కొంత మంది రైతులకు దేవదాయశాఖ భూములలో ప్లాట్లను కేటాయించారు. దీనిపై దేవదాయశాఖ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గత ప్రభుత్వ హయాంలో 300కోట్లు చెల్లించి దేవదాయశాఖ భూములు స్వాధీనం చేసుకున్నారు. అంతలోనే ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ అటకెక్కింది. దీనికి సంబంధించిన దస్త్రాలు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి. దీనిపైనా సీఆర్‌డీఏ అధికారులు స్పష్టత ఇవ్వాలని, బ్యాంకుల్లో ప్రభుత్వం తనఖా పెట్టిన భూముల సంగతి తేల్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్యాపిటల్ గెయిన్‌పై ప్రభుత్వం నూతనంగా మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. క్యాపిటల్ గెయిన్ పొందడానికి అప్పటి ప్రభుత్వం రెండేళ్ల కాలపరిమితి విధించింది. ప్రభుత్వం మారినందున క్యాపిటల్ గెయిన్‌పై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్లాట్లు విక్రయిస్తే... క్యాపిటల్ గెయిన్ వర్తిస్తుందా లేదా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడింది: కేంద్ర ఆర్థిక శాఖ

Last Updated : Mar 20, 2022, 6:06 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details