వైకాపా అధికారంలోకి వచ్చిన 9నెలల్లో రాష్ట్రం తొమ్మిదేళ్లు వెనక్కి వెళ్లిందని ఇంత జీవన విధ్వంసాన్ని కనీవినీ ఎరుగలేదని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వర రావు, హరనాథ్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. కూల్చివేతలు, విధ్వంసాలు, రద్దులు, కోతలు, బెదిరింపులు, వేధింపులు మునుపెన్నడూ లేవని ప్రభుత్వ తీరును వారు చంద్రబాబు వద్ద ఎండగట్టారు. రాజధానికి రైతులిచ్చిన భూముల్లో పేదలకు పట్టాలు ఇస్తామని చెప్పి రైతులు, పేదల మధ్య విద్వేషాలు పెంచుతున్నారని ధ్వజమెత్తారు. అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ వీళ్లు గెలిస్తే మరింత పేట్రేగిపోతారని ధ్వజమెత్తారు. వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంఘటితమై వైకాపా అరాచకాలను అడ్డుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందరి అభిప్రాయాలను తీసుకోలేదని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ నెపంతో తెదేపా అభ్యర్థులను భయపెట్టి స్థానిక సంస్థల్ని హస్తగతం చేసుకోవాలని వైకాపా కుట్ర పన్నిందని కళా వెంకట్రావు ధ్వజమెత్తారు.
'వైకాపా 9నెలల పాలనలో... రాష్ట్రం తొమ్మిదేళ్లు వెనక్కి'
ఆంధ్రప్రదేశ్లో గత 9నెలల్లో కనీవినీ ఎరుగని జీవన విధ్వంసం జరిగిందని సీపీఐ నేతలు మండిపడ్డారు. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర అభివృద్దికి తూట్లు పొడవడమే కాకుండా భావితరాల భవిష్యత్తును అంధకారం చేశారని ఆక్షేపించారు. వీటితో పాటు పంచాయితీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ నెపంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్దులను భయపెట్టే యత్నం జరుగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు మండిపడ్డారు.
chandra