CPI Supports TRS in Munugode By poll: స్వార్థం కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మునుగోడులో ఐదుసార్లు సొంతంగా గెలిచామని, రెండుసార్లు ఇతర పార్టీల మద్దతుతో గెలిచామని చాడ గుర్తు చేశారు. భాజపాను ఓడించే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. తెరాసకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజల సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదని చాడ మండిపడ్డారు. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ప్రస్తుతం రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందన్న ఆయన.. రక్షించేందుకే కమ్యూనిస్టులు అప్రమత్తమయ్యారని తెలిపారు. ప్రగతిశీల శక్తుల ముందు నిలవలేమని రేపు అమిత్ షాకు అర్థమవుతుందన్నారు. ఈ క్రమంలోనే మునుగోడులో పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధంగా లేదన్న చాడ.. అందుకోసమే తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మునుగోడే కాదు అన్ని ఎన్నికల్లో తెరాసతో కలిసి పని చేస్తామన్నారు.
మునుగోడులో ఐదు సార్లు సొంతంగా గెలిచాం. రెండు సార్లు ఇతర పార్టీల మద్దతుతో గెలిచాం. భాజపాను ఓడించే పార్టీకే మా మద్దతు ఉంటుంది. భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. మునుగోడులో తెరాసకు మద్దతు ఇస్తున్నాం. మునుగోడులో పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధంగా లేదు. అందుకే తెరాసకు మద్దతు ఇస్తున్నాం. తెరాసకు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజల సమస్యలపై మా పోరాటం ఆగదు. - చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి