ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హఠాత్తుగా ఆపద.. కొవిడ్ రోగుల హఠాన్మరణం - కొవడ్ మరణాలు

కరోనా పాజిటివ్‌ అని తెలియగానే బెంబేలెత్తాల్సిన పనిలేదు. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి చికిత్సతో తేలికగానే కోలుకుంటున్నారు. అలాగని అశ్రద్ధ వహించకూడదు. కొద్ది మందిలో శ్వాస బాగానే ఆడుతున్నా ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే.. ఉన్నట్టుండి ప్రాణాలమీదకు ముంచుకొస్తోంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు తప్పించుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

covid patients died with happy hypoksiya
కొవిడ్ రోగుల హఠాన్మరణం

By

Published : Aug 3, 2020, 5:33 AM IST

విజయవాడలో ఒక లెక్చరర్‌కు జ్వరం వచ్చింది. అనుమానంతో పరీక్ష చేయించుకోగా.. కరోనా నిర్ధరణ అయ్యింది. ఇంట్లోనే చికిత్స అన్నారు. మర్నాడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయ్యిందని ఆసుపత్రిలో చేర్చి వెంటిలేటర్‌ అమర్చారు. రెండు గంటల్లోపే ప్రాణాలు కోల్పోయారు.

సత్తెనపల్లిలో ఒక వ్యక్తికి స్వల్ప లక్షణాలు కనిపించి, కరోనా పాజిటివ్‌ అన్నారు. అంతలోనే ఆయాసం.. అంబులెన్సు వస్తోందని రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చారు. ఉన్నట్టుండి ఆయాసం పెరిగి.. అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని సోదరుడు ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి గేటు వద్దే కుప్పకూలిన ఆయన.. వెంటనే ప్రాణాలొదిలారు. పరీక్ష చేయిస్తే కరోనా అని నిర్ధారణ అయ్యింది.

నిన్న మొన్నటివరకు మన కళ్ల ముందు చలాకీగా తిరిగినవాళ్లు.. ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేనివాళ్లూ.. కరోనా సోకిన ఒకటి రెండు రోజులకే హఠాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. మిత్రుల ద్వారానో, వాట్సప్‌లోనో ఆ విషాదవార్త విన్నా.. చూసినా రేపు మన పరిస్థితేంటన్న భయం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మొదట్లో వృద్ధులు, ఇతర అనారోగ్యాలు ఉన్నవారికే కరోనా ప్రాణాంతకమన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇటీవల యువత, మధ్య వయస్కులూ మరణిస్తున్నారు. కొందరు యువ వైద్యులు సైతం ఇలా ప్రాణాలు విడిచారు. కరోనావల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులవల్లే చనిపోతున్నారని ఇంతకుముందు అనుకునేవారు. అయితే కరోనా మరణాలకు హ్యాపీ హైపోక్సియా, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం (థ్రాంబోసిస్‌) ప్రధాన కారణమని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. సైటోకైన్‌ స్టార్మ్‌, ఇన్‌ఫ్లమేషన్‌వల్ల ఈ సమస్యలు వస్తున్నట్లు వివరిస్తున్నారు. అన్ని వయసుల వారికీ ఈ సమస్యలు ఉంటున్నాయి.

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, ఆస్థమా, పొగతాగడం వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు ఉన్న వారిలో సహజంగానే ఆక్సిజన్‌ స్థాయి కొంత తక్కువ. అలాంటి సమస్యలేమీ లేని ఆరోగ్యవంతుల్లో ఆక్సిజన్‌ 96%, అంతకంటే ఎక్కువ ఉండాలి.

కొంతమంది కొవిడ్‌ రోగుల్లో ఆక్సిజన్‌ 65-70 శాతానికి పడిపోయినా.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావట్లేదు. కానీ వారిలో అవయవాలకు తగినంత ఆక్సిజన్‌ అందడం లేదు. ఇలాంటివారు ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు.

హ్యాపీ హైపోక్సియా ఉన్న కొవిడ్‌ రోగుల్లో నిద్రలో ఆక్సిజన్‌ స్థాయి బాగా పడిపోవటంతో కొందరు నిద్రలోనే చనిపోతున్నారు.

కొందరు కరోనా రోగుల్లో కనిపిస్తున్న ప్రమాదకరమైన లక్షణం హ్యాపీ హైపోక్సియా. వైద్య పరిభాషలో ఇదివరకు దీనిపై పెద్దగా చర్చ లేదు. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాతే ఈ పదం చర్చలోకి వచ్చింది. సాధారణంగా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ కొందరు కరోనా రోగుల్లో ఇది పడిపోయినా.. బయటకు ఏ సమస్యా కనిపించడం లేదు. వారు చూడటానికి మామూలుగానే ఉంటున్నా ప్రాణాలు పోతున్నాయి. అందుకే దీనికి హ్యాపీ హైపోక్సియా అని పేరు పెట్టారు.

కొవిడ్ రోగుల హఠాన్మరణం

సైటోకైన్‌ల ఉప్పెనతో రక్తనాళాల్లో గడ్డలు

కొందరు కరోనా రోగుల్లో.. శరీరంలో వివిధ భాగాలకు రక్తం సరఫరా చేసే పెద్ద, చిన్న రక్తనాళాల్లో హఠాత్తుగా గడ్డలు ఏర్పడుతున్నాయి. దీన్నే వైద్య పరిభాషలో థ్రాంబోసిస్‌ అంటారు. దీనికి ప్రధాన కారణం సైటోకైన్‌లు అవసరమైనదాని కంటే అనేక రెట్లు ఎక్కువగా విడుదలవడం. దీన్నే సైటోకైన్‌ స్టార్మ్‌ అంటారు. శరీరంలో బ్యాక్టీరియా లేదా వైరస్‌లవల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చినప్పుడు, వాటిని నాశనం చేసేందుకు అవసరమైన యాంటీబాడీలను విడుదల చేసే కణాల్ని సైటోకైన్‌లు ప్రేరేపిస్తాయి. అలా విడుదలయ్యే వాటిని అక్యూట్‌ ఫేజ్‌ రియాక్టెంట్స్‌ అంటారు. కొన్ని సందర్భాల్లో వైరస్‌ని చంపేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో సైటోకైన్‌లు విడుదలవ్వడంవల్ల శరీరంలో ఆరోగ్యకరమైన కణాలకు హాని జరుగుతుంది. ఇది ఒక రకమైన వాపు ప్రక్రియను ప్రేరేపిస్తుంది. అవి రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. దాన్నే సైటోకైన్‌ ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌ అంటారు. ఇదివరకు ఏ వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లలోనూ లేని స్థాయిలో.. కొందరు కొవిడ్‌ రోగుల్లో హైపర్‌ ఇన్‌ఫ్లమేటరీ లేదా హైపర్‌ సైటోకైన్‌ స్టార్మ్‌ ఏర్పడుతోందని, దానివల్ల అనేక అనర్థాలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అన్ని అవయవాలపైనా ప్రభావం

రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడితే ఊపిరితిత్తులు, గుండె, మెదడు, మూత్రపిండాలు, కాలేయం, జీర్ణకోశ వ్యవస్థ సహా శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రభావం పడుతోంది. కొన్ని సందర్భాల్లో కాళ్లకు రక్తం సరఫరా చేసే నాళాల్లోనూ గడ్డలు ఏర్పడుతున్నాయి. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల హఠాత్‌ మరణాలు సంభవిస్తున్నాయి. రక్తనాళాల్లో లోపలి వైపు గోడలు చాలా మృదువుగా ఉండేందుకు ఎండోథీలియం లైనింగ్‌ ఉంటుంది. అవసరమైన చోట రక్తం గడ్డ కట్టేందుకు, లేదా కరిగిపోయేందుకు ఇది ఉపయోగపడుతుంది. కొవిడ్‌ రోగుల్లో సైటోకైన్‌ స్టార్మ్‌ వల్ల ఏర్పడుతున్న ఇన్‌ఫ్లమేషన్‌కు ఆ ఎండోథీలియం లైనింగ్‌ దెబ్బతిని మైక్రోథ్రాంబోసిస్‌ సమస్య ఏర్పడుతోంది. పెద్ద రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడితే.. గుండెపోటు వస్తోంది. చిన్న రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడితే కార్డియోమయోపతి, మయోకార్డైటిస్‌ వంటి సమస్యలు వస్తున్నాయి. గుండె కణాలు దెబ్బ తింటున్నాయి. గుండె లయ దెబ్బతింటోంది. అవసరమైన దానికంటే వేగంగా, నెమ్మదిగా కొట్టుకోవడం, చివరకు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరికి మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల పక్షవాతం వంటి సమస్యలు వస్తున్నాయి.

ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసుకోవాలి

తీసుకోవలసిన జాగ్రత్తలు

  • పాజిటివ్‌ అని తేలినవారు, లక్షణాలుండి... నిర్ధారణ పరీక్ష చేయించుకుని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయి పరీక్షించుకోవాలి. ప్రతి ఇంట్లో పల్స్‌ ఆక్సీమీటర్‌ ఉంచుకుని ప్రతి 4 గంటలకు ఒకసారి పరీక్షించుకోవాలి.
  • వైద్యులు పరీక్షించి, వారిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడితే.. రక్తం పల్చబడేందుకు ‘హెపారిన్‌’ లాంటి మందులు ఇస్తారు.
  • విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఆరు నిమిషాలు నడిచిన తర్వాత కూడా.. ఆక్సిజన్‌ స్థాయి 96% కంటే పైనే ఉండాలి. 95-94% కంటే తగ్గితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అలాగని ఆక్సిజన్‌ తగ్గిన వారంతా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు.
  • జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు వచ్చి.. పరీక్ష చేయించుకోకుండా జాప్యం చేస్తే శరీరంలో వైరల్‌ లోడ్‌ పెరిగిపోతోంది. సైటోకైన్‌ స్టార్మ్‌ దశకు చేరుకున్నాక ఆసుపత్రికి వెళ్లినా, అప్పటికే పరిస్థితి విషమించి ప్రాణాపాయం సంభవిస్తుంది. వ్యాధిని త్వరగా గుర్తించడం, వెంటనే చికిత్స పొందడం అవసరం.
  • థ్రాంబోసిస్‌ని ఎవరూ సొంతంగా గుర్తించలేరు. కొవిడ్‌కి ఇంట్లో చికిత్స పొందుతున్నవారు ఆయాసం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
  • అవసరమైన వారికి డెక్సామెథాజోన్‌ వంటి స్టెరాయిడ్‌లు, రెమ్‌డెసివిర్‌ వంటి యాంటీవైరల్‌ మందులు ఇస్తారు. ఈ మందులన్నీ పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో, వారు సూచించిన మోతాదు మేరకే తీసుకోవాలి.

వీటిపై దృష్టి పెట్టాలి..

జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలుంటే వెంటనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.

కొందరికి జ్వరం 99 డిగ్రీలే ఉన్నా.. వాసన, రుచి కోల్పోతున్నారు, నీళ్ల విరేచనాలు అవుతున్నాయి. ఇలాంటి లక్షణాలతోనూ కరోనా నిర్ధారణ అవుతోంది. వీరూ ఆక్సిజన్‌ స్థాయి చూసుకుంటూ ఉండాలి.

ముప్పు తీవ్రతను గుర్తించాలంటే రక్తం గడ్డకట్టడం గురించి తెలుసుకోడానికి డి డైమర్‌, రక్తనాళాల్లో వాపు గుర్తింపునకు ఇంటర్‌ ల్యూకిన్‌ 6, సీ రియాక్టివ్‌ ప్రోటీన్‌ లాంటి పరీక్షలు చేయించాలి.

ఇవీ చదవండి...

ఆమె బాత్రూంకు వెళ్తుండగా పడిపోయింది: విమ్స్ ఘటనపై ఆసుపత్రి డైరెక్టర్

ABOUT THE AUTHOR

...view details