శాసనమండలి కార్యదర్శిపై ఛైర్మన్ షరీఫ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల అంశంపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై బులిటెన్ విడుదల చేయాలని తాను ఆదేశించినట్లు తెలిపారు. ఆ ఆదేశాలను మండలి కార్యదర్శి రెండుసార్లు తిరస్కరించడంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. మండలిలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. సెలెక్ట్ కమిటీ నియమించే అంశంలో జరిగిన వ్యవహారాన్నే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు షరీఫ్ చెప్పారు. రూలింగ్ అమలు చేయకుండా కార్యదర్శి జాప్యం చేయడంపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. విశిష్ట అధికారంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నాననీ.. ఛైర్మన్ నిర్ణయాన్ని కార్యదర్శి వ్యతిరేకించడం ఇప్పటివరకు జరగలేదని షరీఫ్ పేర్కొన్నారు.
గవర్నర్‌ను కలిసిన మండలి ఛైర్మన్ షరీఫ్ - undefined
మండలి ఛైర్మన్ షరీఫ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై వివరించారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరినా ఫైలు వెనక్కి పంపిన విషయాన్ని గవర్నర్‌కు మండలి ఛైర్మన్ తెలిపారు.
రాజ్‌భవన్‌కు వెళ్లిన మండలి ఛైర్మన్ షరీఫ్ గవర్నర్‌కు నాలుగు పేజీల వినతి పత్రాన్ని అందజేశారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు సంబంధించి సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో చొరవ తీసుకోవాలనీ.. అలాగే మండలి నిర్ణయాలకనుగుణంగా కార్యదర్శి వ్యవహరించేలా చూడాలని గవర్నర్‌ను కోరారు. మండలి కార్యదర్శి, సిబ్బంది తనకు ఏ మాత్రం సహకరించడం లేదని లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగానే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ఆదేశాలను ఉల్లంఘించారని షరీఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను లేఖలో వివరించిన ఛైర్మన్.. బులిటెన్ విడుదల చేయాలని తాను ఇచ్చిన ఆదేశాలను తిరస్కరిస్తూ కార్యదర్శి పంపిన నోట్ ఫైల్స్‌ను లేఖకు జత చేశారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటును ఇప్పటికే చాలా ఆలస్యం చేశారనీ.. ఇకనైనా తన ఆదేశాలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: 'వారికి ముప్పు వాటిల్లితే.. వైకాపా ప్రభుత్వానిదే బాధ్యత'