విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల భర్తీపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఇప్పుడు ప్రభుత్వం అమలుకు చర్యలు తీసుకుంటే పేదవారికి కార్పొరేట్ విద్య సులభంగా అందుతుంది. రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రముఖ ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి. ప్రైవేటు విద్యా సంస్థలు తమ పరిధిలోని కాలనీలు, గ్రామాలకు చెందిన విద్యార్థులకు 25శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. విద్యా హక్కు చట్టం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ చేరుతుంది.
చట్టం ప్రకారం ఇలా..
ఆర్టీఈ చట్టం ప్రకారం 14ఏళ్ల వరకు పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలి. ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లను సెక్షన్ 12(1)(సీ) కింద పేదవారికి కేటాయించాలి. ఆయా పాఠశాలల్లో ప్రారంభ తరగతుల్లో ఎల్‌కేజీ లేదా ఒకటో తరగతిలోని సీట్లలో 25శాతం పాఠశాల పరిధిలోని పేదవారికి ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రభుత్వమే ఆ విద్యార్థుల రుసుములను ప్రైవేటు బడులకు చెల్లిస్తుంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులను పొందే అవకాశం ఉంటుంది. చెల్లింపుల కోసం ప్రైవేటు బడులకు ప్రభుత్వమే ఫీజులను నిర్ణయించవచ్చు.
సీటు పొందిన విద్యార్ధుల నుంచి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం డొనేషన్లను వసూలు చేయడానికి విలులేదు. ప్రవేశాలకు రాత, మౌఖిక పరీక్షలను నిర్వహించకూడదు. కేవలం ఆర్థిక, సామాజిక, వెనుకబాటుతనం ఆధారంగానే ప్రవేశాలను కల్పించాలి.