ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనవరి మూడో వారంలో కరోనా టీకా పంపిణీకి వేగంగా ఏర్పాట్లు - రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ

రాష్ట్రంలో జనవరి 3వ వారంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందాలు సిద్ధం అవుతున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిజిషియన్లు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, పల్మనాలజిస్టులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లోనూ ఈ కమిటీలు ఏర్పడనున్నాయి.

corona vaccine distribution in ap
కరోనా టీకా పంపిణీకి వేగంగా ఏర్పాట్లు

By

Published : Dec 20, 2020, 10:00 AM IST

కొవిడ్‌ టీకా పంపిణీలో భాగంగా ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటవుతున్నాయి. టీకా వేశాక ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్సనందించేందుకు ఈ బృందాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో జనరల్‌ ఫిజిషియన్లు, కార్డియాలజిస్ట్‌, న్యూరాలజిస్ట్‌, పల్మనాలజిస్టులతో ప్రత్యేక కమిటీ ఏర్పడనుంది. బోధనాసుపత్రి, జిల్లా ఆసుపత్రుల్లోనూ ఈ కమిటీలు ఏర్పడనున్నాయి. బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో 20 చొప్పున.. ప్రాంతీయ ఆసుపత్రుల్లో పది చొప్పున ప్రత్యేకంగా పడకలు కేటాయించనున్నారు. సీహెచ్‌సీలో తప్పకుండా జనరల్‌ ఫిజిషియన్‌ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. జనవరి మూడోవారం నుంచి టీకాలు వేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలివిడత సుమారు 5వేల కేంద్రాలను ఏర్పాటుచేసే అవకాశముంది. ప్రతి కేంద్రంలో రోజుకు సుమారు వంద మందికి టీకా వేసే అవకాశం ఉంది. తొలి విడత టీకాను 30 రోజుల్లో పూర్తి చేసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు టీకా పంపిణీ చేస్తారు.

త్వరలో గ్రామ సభలు

టీకా పంపిణీలో ఇతర శాఖలను భాగస్వాములను చేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌/కార్పొరేషన్‌, విద్యాశాఖ, వైద్య విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్ల సేవలు కీలకమవనున్నాయి. వీరికి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖ ఖరారు చేసింది. టీకా పంపిణీ, ప్రాధాన్యంపై స్థానికుల్లో అవగాహనను పెంచేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలకు శిక్షణనివ్వనున్నారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో త్వరలో గ్రామసభలు జరగనున్నాయి. టీకా పంపిణీపై చైతన్యపర్చడానికి కొవిడ్‌-19 ప్రమాణాలను అనుసరించి ఉపాధ్యాయులు, విద్యార్థుల ర్యాలీలు జరగనున్నాయి. టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నెలాఖరులోగా శిక్షణ పూర్తి

ముఖ్యమైన ప్రభుత్వ శాఖలను వ్యాక్సినేషన్‌లో భాగస్వాములను చేస్తున్నారు. ఈ నెలాఖరునాటికి ఉన్నతస్థాయి నుంచి కింది స్థాయి ఆరోగ్య సిబ్బందికి అంతర్గత శిక్షణనిచ్చేలా జిల్లాల్లో చర్యలు తీసుకుంటున్నారు. టీకా పంపిణీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుర్తించిన వారికి ఎలా టీకా వేయాలి? వివరాలను ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేయాలన్న అంశాలపై శిక్షణలో నిపుణులు వివరిస్తున్నారు. పీహెచ్‌సీ వైద్యులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బందికి నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఈ నెలాఖరులోగా శిక్షణ పూర్తి కానుంది. జిల్లాల సంయుక్త కలెక్టర్ల (వైద్యం) నేతృత్వంలో టీకాను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

* టీకా సామగ్రిని తరలించేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. ఐస్‌ప్యాక్‌లతో కూడిన టీకా పెట్టెలు, మూత తెరవని వయల్స్‌ను శీతల కేంద్రాలకు తరలించేందుకు వాటిని ఉపయోగిస్తారు. ఈ మేరకు వైద్యశాఖ రవాణా శాఖకు లేఖ రాసింది.
* అన్ని ఆసుపత్రుల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ఆ శాఖను అప్రమత్తం చేస్తారు. అవసరమైనచోట జనరేటర్లను అద్దెకు తీసుకుని పీహెచ్‌సీల్లో సిద్ధం చేస్తారు.
* టీకా పంపిణీ కేంద్రంలో వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌-1 నుంచి వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌-5 వరకు ఉంటారు. పోలీసు/హోంగార్డు/ఎన్‌సీసీ విద్యార్థులతోపాటు ఏఎన్‌ఎంలు, ఆశాలను వ్యాక్సినేషన్‌ అధికారులుగా గుర్తించారు.
* రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ, టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశాలు ప్రతి 15 రోజులకోసారి, జిల్లా టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశం ప్రతి సోమవారం, మున్సిపల్‌/కార్పొరేషన్‌ స్థాయి కమిటీ సమావేశం ప్రతి మంగళవారం, మండల టాస్క్‌ఫోర్సు కమిటీ ప్రతి సోమవారం సమావేశమై టీకా పంపిణీపై సమీక్షించాలి.

ఇదీ చదవండి:

పేదలకు ఉచిత ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details