రాష్ట్రంలో కొత్తగా 6 వేల 582 మందికి కరోనా నిర్ధారణ అయింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటిలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 వందల 71 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనూ తీవ్రత అధికంగా ఉంది. ప్రస్తుతం 44వేల 686 యాక్టివ్ కేసులు ఉండగా... 2వేల 343 మంది కోలుకున్నారు. కరోనా ఉద్ధృతి హడలెత్తిస్తుండగా... ఆస్పత్రుల్లో సరైన సేవలు అందక రోగులు యాతన పడుతున్నారు.
గుంటూరు జిల్లాలో 5వేలకు పైగా పడకలు సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతుండగా... పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. స్ట్రెచర్లు, పడకలు సరిపోక నేలపైనే రోగులు పడి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పడకలు ఖాళీ లేక చాలామంది వెనక్కి వెళ్తుండగా... ఆస్పత్రిలో రోజుల తరబడి ఉన్నా తగిన వైద్యం అందడం లేదని మరికొందరు వాపోతున్నారు. రోగులు, వైద్య సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్లు, గ్లోవ్స్, సర్జికల్ మాస్కులూ తగినన్ని లేక ఆందోళనకర పరిస్థితులున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయిన వేళ... విజయవాడలో కొవిడ్ లక్షణాలున్న చాలామంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వంద మంది వరకు బాధితులు వస్తున్నారు. వైరస్ తీవ్రత ఆధారంగా ఔషధాలు, చికిత్స అందిస్తున్నారు.