దిల్లీలో ఇటీవల జరిగిన ఓ మతపర కార్యక్రమానికి హాజరై రాష్ట్రానికి తిరిగి వచ్చిన కొందరిలో పాజిటివ్ లక్షణాలు బయటపడడం వారితో సన్నిహితంగా మెలిగిన వారిలోనూ లక్షణాలు కనిపించడం కలకలం సృష్టిస్తోంది. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతుండడం మహమ్మారి వ్యాప్తి ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన కలిగిస్తోంది.
సుమారు 500 హాజరు!
దిల్లీలో 2 వారాల కిందట జరిగిన మతపర కార్యక్రమానికి రాష్ట్రం నుంచి సుమారు 500 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారిలో అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో సుమారు 200 మంది నమూనాలు సేకరించగా ఇప్పటివరకూ ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధరించారు. శాంపిళ్లు సేకరించిన వారిలో ఒక్క ప్రకాశం జిల్లా నుంచే 103 మంది ఉన్నారు. వారందరినీ ఒంగోలు, మార్కాపురం, చీరాల క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
రోజు వ్యవధిలో ఇద్దరు మృతి..
దిల్లీ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన విజయవాడ యువకుడి తల్లిదండ్రులు వివిధ అనారోగ్య కారణాలతో ఒకరోజు వ్యవధిలో మరణించారు. వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన భార్యాభర్తల్లో భార్య ఆదివారం, భర్త సోమవారం మరణించారు. వారి కుమారుడి ప్రయాణనేపథ్యం తెలుసుకున్న అధికారులు విజయవాడ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది.
రాజమహేంద్రవరంలో కలవరం
దిల్లీ కార్యక్రమానికి హాజరై వచ్చి రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు సోమవారం రాత్రి మృతి చెందడమూ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలిన మరో ఇద్దరితో సన్నిహితంగా మెలిగిన వారిలో 40 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో దిల్లీ నుంచి వచ్చినవారు 17 మంది ఉండగా.. 72 ఏళ్ల వృద్ధుడికి వైరస్ పాజిటివ్ అని తేలింది. రాజమహేంద్రవరానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధరించారు. ఆయన కొన్ని రోజుల కిందట సామర్లకోట, పిఠాపురం వెళ్లి వచ్చినట్లు అధికారులు చెప్పారు.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు దిల్లీ వెళ్లి వచ్చినవారు ఎక్కడెక్కడ తిరిగారు ఎవరెవరితో మాట్లాడారన్న అంశాలను ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో మరో ఇద్దరికి కరోనా.. 23కి చేరిన కేసులు