గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 126కు చేరుకుంది. శుక్రవారం 4 కొత్త కేసులు నమోదయ్యాయి. పొన్నూరుకు చెందిన యువకుడితో పాటు గుంటూరు నగరానికి చెందిని ముగ్గురికి వైరస్ సోకింది. పొన్నూరు యువకుడికి నెల క్రితం ఇటలీ నుంచి వచ్చిన సోదరుడి ద్వారా వైరస్ సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక గుంటూరు 3 కేసులకు సంబంధించి వారి కుటుంబసభ్యుల ద్వారా వైరస్ సంక్రమించినట్లు తేల్చారు. జిల్లాలో కరోనా పాజిటివ్ గా తేలిన మొదటి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. గతంలో అనుమానం ఉన్న వారందరినీ గుంటూరు తరలించి పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇపుడు ట్రూనాట్ విధానంలో ప్రిజంప్టివ్ పాజిటివ్ గా తేలిన వారికి పరీక్షలు చేస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. గుంటూరు నగరంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ ఆదేశించారు. రెడ్ జోన్లలో కమిషనర్ పర్యటించారు.
కర్నూలు జిల్లాలో నిన్న 13 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 126 మందికి వైరస్ సోకింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. ఒక్కరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేసే వైద్యురాలికి పాజిటివ్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమె వద్ద వైద్యం పొందిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఓ వైద్యుడు కరోనాతో మృతి చెందారు. ఆయన వద్ద వైద్యం తీసుకున్నవారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఆ వైద్యుడి ఇంట్లో ఆరుగురికి కరోనా వచ్చినట్లు సమాచారం. ఎక్కువ కేసుల ఉన్నందున పోలీసులు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో కొత్తగా ఆరుగురికి వైరస్ సోకింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 64 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నెల్లూరు తర్వాత నాయుడుపేట లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అధికారులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.