రాష్ట్రంలో కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడట్లేదు. రోజువారీ కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతోంది. నిన్న 10వేల 526 కేసుల నమోదుతో మొత్తం బాధితుల సంఖ్య 4లక్షల3వేల 616కి చేరింది. మరోసారి తూర్పుగోదావరిలోనే అత్యధికంగా 1178 కేసులు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్త కేసులను చూస్తే దేశంలో రెండో స్థానానికి ఏపీ చేరువైంది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న తమిళనాడుకు మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 5 వేల 622 కేసుల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోజూ సగటున తమిళనాట 5 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 10 వేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒరవడి చూస్తే తమిళనాడును వెనక్కి నెట్టి ఏపీ రెండో స్థానానికి చేరే అవకాశముంది.
మరోవైపు జిల్లాల్లోనూ కేసులు సంఖ్య పైపైకి వెళ్తోంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో కొత్తగా 33 మంది వైరస్ బారినపడ్డారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు కరోనా నిర్ధరణ అవడంతో ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. విమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్‌చంద్ సెప్టెంబర్ 1నాటికి 650 పడకలు వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. ప్లాస్మాదానంపై విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
గుంటూరు జిల్లాలో మరో 801 కరోనా కేసులు వెలుగుచూశాయి. కేసుల సంఖ్య 35వేలు దాటగా 26వేల 199 మంది కోలుకున్నారు. గుంటూరు, నరసరావుపేటలో వైరస్ ఉద్ధృతిలో ఏమాత్రం మార్పు లేదు. ఇంటింటికీ తిరిగి కరోనాపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని గుంటూరు మున్సిపల్ కమిషనర్ అనురాధ హెచ్చరించారు. హోం ఐసోలేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. కర్నూలు జిల్లాలో 757 కొత్త కేసులతో మొత్తం సంఖ్య 42వేలు దాటింది. 35వేల 127 మంది కోలుకున్నారు.