ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా...9 రోజుల్లోనే రెట్టింపు

By

Published : Apr 10, 2021, 5:02 AM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో కంటే ఏప్రిల్‌లో కేసులు మరింత పెరిగాయి. గత తొమ్మిది రోజుల్లోనే వీటి సంఖ్య రెట్టింపు అయింది.మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం వల్ల వైరస్‌ కోరలు చాస్తోంది. మరో 2 నెలలపాటు ఈ దూకుడు కొనసాగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా...9 రోజుల్లోనే రెట్టింపు
రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా...9 రోజుల్లోనే రెట్టింపు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో కంటే ఏప్రిల్‌లో కేసులు మరింత పెరిగాయి. గత తొమ్మిది రోజుల్లోనే వీటి సంఖ్య రెట్టింపు అయింది. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం వల్ల వైరస్‌ కోరలు చాస్తోంది. మరో 2 నెలలపాటు ఈ దూకుడు కొనసాగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా తిరుపతి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేసులు రికార్డు అవుతున్నాయి. గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. విశాఖ నగర శివార్లలోని ఆనందపురం, పెందుర్తి, మధురవాడతో పాటు నర్సీపట్నం, యలమంచిలి పట్టణ ప్రాంతాలు, శివారు గ్రామాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పటమట, గుణదల, విద్యాధరపురం, భవానీపురం, ఓల్డ్‌ ఆర్‌ఆర్‌పేట, కృష్ణలంక, ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితుల తాకిడి పెరుగుతోంది. ఇదే సమయంలో పలు ప్రైవేటు ఆసుపత్రులు పడకల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్సనందించేందుకు వెనకంజ వేస్తున్నాయి.
రాష్ట్రంలో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య 31,892 నమూనాలను పరీక్షించగా గుర్తించిన కేసులు 2,765 (8.6%) ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, గుంటూరు 490, కృష్ణా 341, విశాఖపట్నం జిల్లాలో 335 చొప్పున
కేసులు రికార్డయ్యాయి. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

పడకలు లేవు.. రేపు రండి!
కొవిడ్‌కు చికిత్సనందించే ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల వివరాలు వైద్య ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వీటిని చూసి బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు ఫోన్లు చేస్తే కొన్నింటినుంచి పడకలు లేవనే సమాధానం వస్తోంది. ఆన్‌లైన్‌లో మాత్రం పడకలు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తోంది. బాగా తెలిసినవారికి, సిఫార్సులు ఉన్నవారికే పడకలు కేటాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం...రాష్ట్రవ్యాప్తంగా 84 ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందుబాటులో ఉంది. కొన్ని ఆసుపత్రులకు సంబంధించిన పడకల వివరాలు ఇంకా నమోదు కాలేదు. ఈ ఆసుపత్రులన్నింటిలో కలిపి 1754 ఐసీయూ పడకలకు 1,415, ఆక్సిజన్‌ అందించే పడకలు 7753కిగాను 6489, 3002 సాధారణ పడకలకు 2339 చొప్పున ఖాళీగా ఉన్నట్లు ఆన్‌లైన్‌ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం పేర్కొంది.
*గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి ఫోన్‌ చేస్తే.. ఆరోగ్యశ్రీ కింద కేటాయించిన పడకలు ఖాళీగా లేవని, ఉదయం రిసెప్షన్‌లో కనుక్కోవాలని అక్కడి సిబ్బంది గురువారం సాయంత్రం సమాధానమిచ్చారు. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో మాత్రం 31 పడకలకు 21 మాత్రమే నిండినట్లు ఉంది.
*విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వివరాలను వెబ్‌సైట్‌లో చూసి ఫోన్‌ చేస్తే నంబరు పని చేయడం లేదు.
*ఒంగోలులో ఓ ప్రైవేటు ఆసుపత్రి పేరు జాబితాలో చూపించినా పడకల వివరాలు కనిపించడం లేదు. మరో ఆసుపత్రి వారిని సంప్రదిస్తే పడకలు లేవని సమాధానమిచ్చారు. వాస్తవానికి ఇక్కడ జనరల్‌ బెడ్లు 30 ఉంటే అన్నీ ఖాళీగా ఉన్నట్లు చూపారు.
*విశాఖ జిల్లాలో కొవిడ్‌ ఆసుపత్రుల కింద చూపించిన 6 ఆసుపత్రుల్లో ప్రైవేటు ఆసుపత్రుల గురించిన సమాచారం లేదు.
*తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాల గురించి వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ నిష్ఫలమే అయింది.
*నెల్లూరు జిల్లాలో ఆరింటిని కొవిడ్‌ ఆసుపత్రుల కింద గుర్తించారు. 2 ఆసుపత్రుల్లో పడకల గురించిన వివరాలు లేవు. ఓ ఆసుపత్రి వారిని సంప్రదిస్తే పడకలు లేవనే సమాధానం వచ్చింది. వైద్య ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో మాత్రం పది ఐసీయూ బెడ్లు, 15 ఆక్సిజన్‌ జనరల్‌ బెడ్లు, 25 సాధారణ పడకలన్నీ ఖాళీగా ఉన్నాయి.
*పశ్చిమగోదావరి జిల్లాలోని 7 ఆసుపత్రులకు సంబంధించి పడకల సంఖ్య చూపించారు. ఎవరూ చికిత్స పొందడం లేదు. కడప జిల్లాలో ఆరు ఆసుపత్రులు ఉన్నాయి. ఫాతిమా వైద్య కళాశాల పడకల వివరాలు లేవు. చిత్తూరు జిల్లాలోని మాధురి రెమిడీ ఆసుపత్రి పడకల వివరాలు లేవు.

స్పష్టమైన ఆదేశాలనిచ్చాం..
ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకొని చికిత్సనందించాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని జిల్లా వైద్యాధికారి ఒకరు వివరణ ఇచ్చారు. దీన్ని యాజమాన్యాలు అమలు చేయాల్సిందేనన్నారు. కలెక్టర్లు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

గురుకులాల్లో 41 చోట్ల విద్యార్థులకు పాజిటివ్‌

పది రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని 38 సాంఘిక, 3 బీసీ సంక్షేమ గురుకులాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైనప్పుడు ఇతర విద్యార్థులకు పరీక్షలు చేయడంలోనూ జాప్యమేర్పడుతోంది. ఒక్కసారి 20 నుంచి 30 మందికి మాత్రమే పీహెచ్‌సీ సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. దీనివల్ల నియంత్రణ ఎలా సాధ్యమనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ జరుగుతున్నాయి. ఇందుకోసం విద్యార్థులు ఇతర కళాశాలలకు వెళ్లాలి. ఇతర ప్రాంతాల నుంచి బోధన, బోధనేతర సిబ్బంది వస్తుంటారు. కరోనా కేసులు పెరగడానికి ఇదీ ఓ కారణమని అధికారులు భావిస్తున్నారు. విశాఖ జిల్లా కృష్ణాపురం సాంఘిక సంక్షేమ గురుకులంలో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లా లేపాక్షి, పెనుకొండలోని బీసీ గురుకులాల్లో ఒక్కో విద్యార్థి కరోనా బారినపడ్డారు. చిత్తూరు జిల్లా పీలేరు గురుకులంలో ఓ విద్యార్థి కరోనా బారిన పడ్డారు.

ఇదీ చదవండి:ఉత్తరాఖండ్​లో... రాష్ట్రానికి చెందిన 20 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details