ఈనెల 26న ఆసరా, వైఎస్ఆర్ చేయూత కింద మహిళలకు పాడి పశువుల పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. వైఎస్ఆర్ చేయూత, ఆసరా కార్యక్రమాలపై సమీక్షించిన ఆయన...అధికారులకు పలు సూచనలు చేశారు. వర్చువల్ విధానంలో 4వేల గ్రామాల్లో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దశల వారీగా పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
తొలుత ఆ జిల్లాల్లోనే...
తొలుత ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభించగా.. తర్వాత దశలవారీగా మిగిలిన జిల్లాల్లో పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఒక్కో యూనిట్ ధర రూ.75 వేలుగా నిర్ణయించగా.. ప్రాజెక్టు విలువ రూ.5,386 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ప్రణాళికాబద్ధంగా పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. మహిళల్లో స్వయం సాధికారత, సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం కార్యక్రమం అమలు చేయనున్నట్లు తెలిపారు.