''ప్రాంతాలవారీగా అభివృద్ధిలో సమతౌల్యం సాధించడానికి అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తూ విశాఖలో కార్యనిర్వాహక, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేసింది. ఇందుకోసం ఆగస్టులో ఏపీ పాలనా వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం-2020 చేసింది. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా...’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. అక్కడ హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల ప్రణాళికలో భాజపా కూడా చెప్పిందని గుర్తు చేశారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి 9.25 గంటల నుంచి 10.42వరకు అమిత్‌షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలపై ముఖ్యమంత్రి కార్యాలయం రాత్రి 11 గంటల సమయంలో ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 15న దిల్లీకి వచ్చినప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి మొత్తం 13 అంశాలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మరో మూడు అంశాలను కలిపి మొత్తం 16 విషయాలపై విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఇందులో పోలవరం, మూడు రాజధానులు, ప్రత్యేక హోదా, పెండింగ్ నిధుల విడుదలే ప్రధానంగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి వెంట పది మందివిజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 7 గంటలకు దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి నేరుగా తన అధికార నివాసం 1-జన్‌పథ్‌కు వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఆయన వెంట మొత్తం 10 మంది దిల్లీ చేరుకున్నారు. అందులో ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, అదనపు అడ్వొకేట్ జనరల్ జాస్తి భూషణ్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పి.కృష్ణమోహన్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలు ఉన్నారు. అమిత్‌షా వద్దకు మాత్రం ముఖ్యమంత్రితో పాటు విజయసాయిరెడ్డి, ప్రవీణ్‌ప్రకాశ్‌లు వెళ్లారు. అడ్వొకేట్ జనరల్, అదనపు అడ్వొకేట్ జనరల్ వచ్చినందున న్యాయపరమైన అంశాలపై ప్రధానంగా చర్చ సాగి ఉండొచ్చన్న భావన వ్యక్తమవుతోంది. తొలుత తన నివాసంలో సీఎం జగన్ ఎంపీలతో సుమారు 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. అందులో పిల్లి సుభాష్‌చంద్రబోస్, అనూరాధ, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్‌లు పాల్గొన్నారు.