'పాముల కుట్ర' - teleconference
ధర్మపోరాట దీక్షతో భాజపాను ఎండగట్టడంలో సఫలమయ్యామని తెదేపా నేతలతో సీఎం చంద్రబాబు అన్నారు. భాజపాతో జతకట్టిన వైకాపా తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సూచించారు.
ధర్మపోరాట దీక్షతో రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని యావత్ దేశం గుర్తించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. దిల్లీలో తెదేపా నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భాజపాను ఎండగట్టే విషయంలో సఫలమయ్యామని స్పష్టం చేశారు. ఆంధ్రాభవన్ ఎప్పుడూ జాతీయ రాజకీయాలకు వేదికగా ఉంటుందన్నారు. నేడు రాష్ట్రపతిని కలిశాక పోరాటం ఆపేది లేదన్నారు. రాష్ట్రంలో భాజపా చచ్చిన పాము లాంటిదని.. దానిని ఇంకా కొట్టి లాభంలేదన్నారు. బురద పాము లాంటి వైకాపా చచ్చిన పాము లాంటి భాజపాతో కలిసి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. మోదీకి మనం గౌరవం ఇవ్వలేదని వైకాపా నేతలు తప్పుపడుతున్నారని.. వైకాపా-భాజపా బంధానికి ఇది నిదర్శనమన్నారు. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెడుతున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడదామని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.