కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తిరోగమన విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు. రైతులను ప్రోత్సహించకుండా నిరుత్సాహపరుస్తోందని విమర్శించారు. పంటల దిగుబడి పెంచే చర్యలు కేంద్రం చేపట్టట్లేదని.. పంట ఉత్పత్తిని తగ్గించేలా అపసవ్య విధానాలను అమలు చేస్తుండటం బాధాకరమని అన్నారు. తెలంగాణలో వ్యవవసాయ రంగంపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు హాజరయ్యారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్ఠంగా కొనసాగిస్తూనే ఉంటుందని అన్నారు. వానాకాలం రానున్న దృష్ట్యా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పత్తి, మిర్చి, కంది, పుచ్చకాయ తదితర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.