ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరద బాధితులకు రూ.2 వేలు సాయం: సీఎం జగన్

వరద బాధితులకు సాయం అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 7 నాటికి బాధితులకు రూ.2వేల సాయం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అదనంగా నిత్యావసరాలను పంపిణీ చేయాలని సూచించారు.

cm jagan
cm jagan

By

Published : Aug 25, 2020, 3:29 PM IST

స్పందనపై కలెక్టర్లు, పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి జగన్​ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. వరదల తీవ్రత, కరోనా, ఇళ్ల పట్టాలు, ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. పాఠశాలల్లో నాడు-నేడు, వైఎస్​ఆర్​ చేయూత పనులపై చర్చించారు. వరదలు తగ్గుముఖం పట్టాయని సీఎం అన్నారు. శ్రీశైలంలో గేట్లు కూడా మూసివేసే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు 7 నాటికి పంట నష్టాలపై అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముంపు బాధితులకు రూ.2వేలు సాయం అందేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ముంపు బాధితులకు నగదుతో పాటు అదనంగా నిత్యావసరాలు అందించాలని తెలిపారు.

వరద బాధితులకు 25 కిలోల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్‌ అందించాలి. బాధితులకు కిలో కందిపప్పు, కిలో పామాయిల్‌ పంపిణీ చేయాలి. బాధితులకు కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు ఇవ్వాలి. సెప్టెంబర్‌ 7 నాటికి నిత్యావసరాలు ఇచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్‌ వసతులు దెబ్బతిన్నచోట పనులు ప్రారంభించాలి. వ్యాధులు ప్రబలకుండా మందులు అందుబాటులో ఉంచుకోవాలి. అన్ని ప్రాంతాల్లో వెంటనే వైద్య శిబిరాలను ప్రారంభించండి.- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు తాగునీటి వసతులకు క్లోరినేషన్​ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలన్న ఆయన... పంట నష్టంపై 10 రోజుల్లోగా అంచనాలు పూర్తి చేయాలని అన్నారు. ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. వరదల సమయాల్లో బాగా పని చేసిన గోదావరి జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి అభినందించారు.

ఇదీ చదవండి

ప్రభుత్వ సలహాదారు పదవికి రామచంద్రమూర్తి రాజీనామా

ABOUT THE AUTHOR

...view details