ఆర్బీకేల ద్వారా కల్లాల వద్దనే ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై సీఎం జగన్ సమీక్షించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ ఊరి పంట ఏ మిల్లర్ దగ్గరకు వెళ్తోంది అన్న విషయం అధికారులకు మాత్రమే తెలియాలన్నారు. అందుకు అవసరమైతే జిల్లాల కలెక్టర్లు సొంతంగా గోనె సంచులు సేకరించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో తేమ చూడడం కోసం ఆర్బీకేల వద్ద మీటర్లు కూడా ఉన్నాయని చెప్పారు. మిల్లుల వద్దకు ధాన్యం రవాణా చేయడంలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్ వద్దకు పంపించవద్దని స్పష్టం చేశారు.
అందుకోసం జిల్లాను యూనిట్‌గా తీసుకుని, ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలని సీఎం నిర్దేశించారు. కొనుగోలు చేస్తామని చెప్పిన సమయానికి కొనుగోలు చేయాలని, మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో, పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉందని సీఎం స్పష్టం చేశారు. రైతు కోరిన విత్తనాలు పౌర సరఫరాల శాఖ ఇవ్వాలని, అందుకోసం పౌర సరఫరాల శాఖ కూడా ఆర్బీకేను తనదిగా భావించాలన్నారు.
కమిటీలకు అవగాహన కల్పించండి...
రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా వ్యవసాయశాఖ చూడాలని.. వారికి అవసరమైన విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని సీఎం సూచించారు. ఈ-క్రాపింగ్ నుంచి మార్కెటింగ్ వరకూ రెండూ కలిసి పని చేయాలన్నారు. వ్యవసాయ సలహా కమిటీలను క్రియాశీలకం చేయాలన్న ముఖ్యమంత్రి.. ఆ మేరకు ఆ కమిటీలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యవసాయ సలహా కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలని సూచించారు. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం ఉండాలన్నారు. ఆ కమిటీల బాధ్యతలు వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం నిర్దేశించారు. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షించాలన్నారు.
ఆదాయం తగ్గొద్దు..